Share News

నేడు దీక్షా దివస్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:23 AM

నేడు దీక్షా దివస్‌ ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు

నేడు దీక్షా దివస్‌

- అందరి చూపు కరీంనగర్‌ వైపే..

- అల్గునూర్‌ వేదికగా బహిరంగ సభ

- ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేటీ రామారావు

- గులాబీమయంగా కరీంనగర్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

నేడు దీక్షా దివస్‌ ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు.... 2009 నవంబరు 29న అప్పటి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌ పట్టణం తీగలగుట్టపల్లిలో ఉన్న తెలంగాణ భవన నుంచి సిద్దిపేటకు ఆమరణ దీక్ష పట్టేందుకు తరలివెళ్లారు... తెలంగాణ ఉద్యమకారులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఆయనకు మద్దతుగా కదలి సిద్దిపేట వైపు పయనమవుతుంటే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని ఖమ్మం తరలించారు... తన అరెస్టును నిరసిస్తూ ఖమ్మం జైలు నుంచే ఆయన ఆమరణదీక్షకు పూనుకున్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజును దీక్షా దివస్‌గా పాటిస్తూ బీఆర్‌ఎస్‌ ఆయన అరెస్టు అయిన అల్గునూర్‌ చౌరస్తాకు సమీపంలోనే భారీ బహిరంగసభను నిర్వహించతలపెట్టింది. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అద్యక్షుడు కేటీ రామారావు ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఉమ్మడి జిల్లా నుంచి హాజరయ్యే ప్రజలు, బీఆర్‌ఎస్‌శ్రేణులు, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం 35 ఎకరాల స్థలాన్ని చదను చేసి అందుబాటులో ఉంచారు. కరీంనగర్‌ను గులాబీమయం చేశారు. కేటీఆర్‌ మధ్యాహ్నం 3.30కు కరీంనగర్‌ చేరుకుంటారు. 4 గంటలకు బహిరంగ సభను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఫ పూర్వ వైభవం సాధించాలని..

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బహిరంగ సభ రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉద్యమకాలంలో వెన్నంటి నిలిచాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దశాబ్దకాలం పెట్టని కోటలా ఉన్నాయి. గత ఎన్నికల్లో పరిస్థితి తారుమారై బీఆర్‌ఎస్‌ అధికారానికి దూరమైంది. బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన జిల్లాల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలతో అధికారం చేజిక్కించుకున్నది. కాంగ్రెస్‌ అత్యధిక ఎమ్మెల్యేలను ఈ ప్రాంతం నుంచి గెలుచుకోగా బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉత్తర తెలంగాణ నుంచే గెలిచారు. ఇప్పుడు బీజేపీ ఈ ప్రాంతంలో బలమైన శక్తిగా మారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు పొంది అధికారం చేజిక్కించుకోవాలని చూడడం, కాంగ్రెస్‌ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉండడంతో బీఆర్‌ఎస్‌ మళ్లీ ఈ ప్రాంతంలో పట్టుసాధించాలని భావిస్తున్నది. ఇక్కడ పట్టుసాధించడం ద్వారా పూర్వవైభవం పొందాలని అందుకు ఉమ్మడి జిల్లానే వేదికగా మలుచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నదానిలో భాగంగానే ఇక్కడ దీక్షా దివస్‌ బహిరంగ సభ జరుగుతున్నదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఆనాటి ఉద్యమస్పూర్తిని, కేసీఆర్‌ త్యాగాలను ప్రజలకు గుర్తు చే సి వారిలో తిరిగి పట్టుసాధించుకునే లక్ష్యంతో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకున్న నవంబరు 29న దీక్షా దివస్‌ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది.

ఫ అన్ని వర్గాల ఆసక్తి..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బహిరంగ సభను నిర్వహించడం ద్వారా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు, బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్‌పెట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ రెండు పార్టీలను కట్టడి చేయడానికి కరీంనగర్‌ కేంద్రంగా మళ్లీ తన రాజకీయాలను విస్తృత పరిచి బలం పుంజుకోవాలని ఆలోచిస్తున్న బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. ఆదివారం జరుగనున్న దీక్షా దివస్‌ బహిరంగసభపై బీఆర్‌ఎస్‌ భారీ ఆశలు పెట్టుకోగా అన్ని రాజకీయపార్టీలు సభ ఎలా జరుగనుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Nov 29 , 2026 | 01:23 AM