హక్కులు దక్కేలా
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:40 AM
భూసమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చేపడుతున్న భూముల రీసర్వేపై భూహక్కుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
హద్దుల చిక్కులు తీరేలా..
- జిల్లాలో ముమ్మరంగా భూభారతి రీ సర్వే
- ప్రత్యేక దృష్టి సారిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
భూసమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చేపడుతున్న భూముల రీసర్వేపై భూహక్కుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా చుట్టుమట్టిన హద్దుల చిక్కులు తొలగడంతోపాటు భూధార్ కార్డు రూపంలో అసలైన హక్కులు దక్కుతాయనే విశ్వాసం భూ యజమానుల్లో పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో పైలట్ మండలాల్లో గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల వల్ల ఏళ్లతరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు చాలామందికి పరిష్కారం లభించింది. గతంలో ధరణి పోర్టల్‌లో తలెత్తిన పలు చిక్కులను కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా తొలగించారు. దీంతో ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రీసర్వేకు సిద్ధమైంది. తొలివిడతలో జిల్లాలోని 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రక్రియను మొదలు పెట్టింది.
ఫ 94,637 ఎకరాల భూమి వివరాలు..
రీసర్వేలో భాగంగా జిల్లాలోని 70 గ్రామాల్లోని 94,637 ఎకరాల భూమికి సంబంధించి సమగ్రమైన వివరాల్ని సేకరిస్తారు. హద్దుల నిర్ధారణతోపాటు వాస్తవంగా భూమి ఎవరి ఆధీనంలో ఉందని తేలుస్తారు. డీజీపీఎస్ రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌ను రూపొందిస్తారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూమి అసలు హద్దులను నమోదు చేస్తారు. వీటి ఆధారంగా ప్రతీ రైతుకు భూఆధార్‌ను అందిస్తారు. ముందుగా నిర్వహించిన గ్రామసభలో వచ్చిన ఆధారంగా భూ సమస్యలను పరిష్కరిస్తారు. వాస్తవాల్ని ప్రజల ముందుంచుతారు. దీంతో ఊళ్లల్లో ఉన్న గట్టుతగాదాలు పరిష్కరించడంతోపాటు విస్తీర్ణంలో ఉన్న తేడాలను సవరించవచ్చు. గతంలో పైలట్ మండలాలైన సైదాపూర్‌లో 1,789, చిగురుమామిడి మండలంలో 2,589 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇవేకాకుండా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల్లో 31 వేలకుపైగా భూ సంబంధిత అర్జీలు రెవెన్యూ అధికారుల చేతికి వచ్చాయి. ఇందులో ఎక్కువగా సాదాభైనామాకు సంబంధించినవి ఉండగా.. మిగతావి భూ ఆక్రమణలు, విస్తీర్ణంలో తేడాలున్నవి ఉన్నాయి. ఇవేకాకుండా ప్రజావాణిలో ప్రతీ సోమవారం అందే అర్జీలకు మోక్షం లభించాలంటే రీసర్వే పక్కాగా జరగాలి.
ఫ విడతల వారీగా గ్రామాల ఎంపిక
మొదటి విడతలో కొత్తపల్లి (తిమ్మాపూర్), ధర్మరాజ్‌పల్లి (హుజూరాబాద్), పాతర్లపల్లి (ఇల్లందకుంట), ధర్మారం (శంకరపట్నం), విలాసాగర్ (జమ్మికుంట) గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో దాదాపుగా సర్వే తుది దశకు చేరింది. రెండో విడతలో తొమ్మిది గ్రామాలను గుర్తించారు. కమానపూర్ (కొత్తపల్లి), వన్నారం (మానకొండూర్), ఖాసీంపేట్ (గన్నేరువరం), ఫకీర్‌పేట్ (కరీంనగర్ రూరల్), బద్దిపల్లి (కొత్తపల్లి), లలితాపూర్ (మానకొండూర్), యాస్వాడ ( గన్నేరువరం), ఇస్లాంపూర్ (గంగాధర), గోపాల్‌రావుపేట్ (రామడుగు) రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 19 నుంచి గ్రామసభల నిర్వహణ ఇతర ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో గ్రామానికి సంబంధించి జిల్లాస్థాయి ఉన్నతాధికారిని ఇనఛార్జిగా నియమించి ఆయన పర్యవేక్షణలో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రతి భూమిని సర్వే చేపడుతున్నారు. మూడో విడతలో 16, చివరి విడతలో 28 గ్రామాలను ఎంపిక చేస్తారు.
ఫ సిబ్బందికి శిక్షణ
భూభారతి అమలు విషయంలో జిల్లాలో త్వరలో మరిన్ని మార్పులు కనిపించే వీలుంది. ఇప్పటి వరకున్న ఆపరేటర్ల స్థానంలో ప్రతి మండలం నుంచి ఒక జూనియర్ అసిస్టెంట్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. గతంలో ఆపరేటర్లు అక్కడక్కడ తప్పులు చేసిన ఉదంతాలు జిల్లాలో ఉన్నాయి. కొత్తపల్లిలో కోట్లాది రూపాయల విలువైన ఓ భూమి విషయంలో రెవెన్యూ ఉద్యోగులతోపాటు ధరణి ఆపరేటర్‌పైన కేసు నమోదైంది. స్లాట్ బుకింగ్, హక్కుల మార్పిడి, సాదాభైనామా, రిజిస్ర్టేషన ప్రక్రియ, డేటా ఎంట్రీ వంటి అంశాల్లో సమగ్రంగా శిక్షణనిస్తున్నారు. దీంతో గతంలో ఉన్న మాదిరి ఇక్కట్లు ఆయా మండలాల్లో తలెత్తే అవకాశం ఉండదు. పైగా వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అవడం వల్ల ఎక్కడైనా పొరపాట్లు చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రీసర్వేతో భూమి యజమానులకు ఒక శాశ్వత ప్రయోజనం, పరిష్కారం సమకూరనుంది. అప్పుడప్పుడు తాత్కాలికంగా తలెత్తే ఇక్కట్లను కొత్తగా విధుల్లో చేరే సిబ్బంది పరిష్కరించే అవకాశముంది.