Share News

‘చేయూత’కు వేళాయె..!

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:13 AM

కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశ నెరవేరనుంది. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్లను లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు జిల్లా జాబితాను సిద్ధం చేశారు.

‘చేయూత’కు వేళాయె..!

- జిల్లాలో కొత్తగా 13,878 మంది లబ్ధిదారుల ఎంపిక

- నేటి నుంచి 18వ తేదీ వరకు ప్రొసీడింగ్‌ పత్రాల అందజేత

- 19న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

జగిత్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశ నెరవేరనుంది. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్లను లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు జిల్లా జాబితాను సిద్ధం చేశారు. దీంతో జిల్లాలో కొత్త పింఛన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలు అందజేయనున్నారు. ఈనెల 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్మును జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫవితంతు పింఛన్లు 6,424 మంజూరు...

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 13,878 మంది దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇందులో వితంతువులు 6,424 మంది, ఒంటరి మహిళ 1,705 మంది, పైలేరియా బాధితులు 1,082 మంది, దివ్యాంగులు 2,694 మంది, చేనేత కార్మికులు 100 మంది, గీత కార్మికులు 1,873 మంది ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు.

ఫదివ్యాంగుల్లో ఉత్కంఠ..

పుట్టుకతో కొందరు, ప్రమాదాలు, వ్యాధుల బారిన పడి ఇంకొందరు దివ్యాంగులుగా మారిన వారు కొత్త పింఛన్‌ ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. అయితే తీరా పింఛన్‌ దరఖాస్తులు చేసుకునే సమయానికి సదరం సర్టిఫికెట్‌ కాలపరిమితి ముగియడంతో రెన్యూవల్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. సదరం క్యాంపుల్లో ఆలస్యం కావడం, సర్టిఫికెట్‌ జారీ సందర్భంగా గతం కన్నా తక్కువ పర్సంటేజీతో జారీ చేయడంతో పింఛన్‌కు అర్హత కోల్పోవలసి వస్తోంది. ఇలా సదరం క్యాంపు పిలుపు రాక కొందరు, సర్టిఫికెట్‌ రాక మరికొందరు, సర్టిఫికెట్‌ వచ్చినా తక్కువ పర్సంటేజీతో ఉన్నవారు కొందరు ఉండడంతో తుది జాబితా విడుదలైతే తమ పేరు ఉంటుందో లేదో అనే ఉత్కంఠతో ఉన్నారు.

పకడ్బందీగా జాబితా తయారీ

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

జిల్లాలో చేయూత కొత్త పింఛన్‌దారుల జాబితా పకడ్బందీగా తయారు చేశాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా చర్యలు తీసుకున్నాము. దరఖాస్తుల స్వీకరణ మొదలు లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రతీ ప్రక్రియలో అన్ని నిబంధనలు పాటించాం.

నియోజకవర్గాల వారీగా మంజూరైన పింఛన్ల వివరాలు...

---------------------------------------------------------------------------------

నియోజకవర్గం - మంజూరైన పింఛన్లు - వితంతువు - ఒంటరి మహిళ - దివ్యాంగులు - చేనేత - గీత కార్మికులు - పైలేరియా

---------------------------------------------------------------------------------

ధర్మపురి - 3,410 - 1,692 - 368 - 607 - 70 - 412 - 261

జగిత్యాల - 3,948 - 1,778 - 530 - 826 - 19 - 455 - 340

కోరుట్ల - 3,705 - 1,723 - 519 - 715 - 5 - 545 - 198

వేములవాడ- 1,490 - 636 - 159 - 253 - 1 - 250 - 191

చొప్పదండి - 1,325 - 595 - 129 - 293 - 5 - 211 - 92

---------------------------------------------------------------------------------

మొత్తం - 13,878 - 6,424 - 1,705 - 2,694 - 100 - 1,873 - 1,082

---------------------------------------------------------------------------------

Updated Date - Nov 12 , 2026 | 01:13 AM