Share News

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:53 AM

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కరీంనగర్‌ టౌన, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్‌ 16న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 13,157 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6,867 మంది బాలురు, 6,290 మంది బాలికలు ఉన్నారు. అలాగే ఏడుగురు ప్రైవేట్‌గా పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున 73 మందిని చీఫ్‌ సూపరింటెండెంట్‌గా, 73 మందిని డిపార్టుమెంట్‌ అధికారులను, 73 మందిని అదనపు డిపార్టుమెంట్‌ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో జరిగే పరీక్షలకు 700 మందిని ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షా సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా అనుమతించారు. 9.35 నిమిషాల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతిస్తారు. అయితే పరీక్షా కేంద్రాలకు సమయానికి అరగంట ముందే చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫ పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షనను అమలులో ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డుయల్‌ డెస్క్‌ ఫర్నిచర్‌, తాగునీరు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులు, అదనపు డిపార్టుమెంట్‌ అధికారుల పర్యవేక్షణతో పాటు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి విద్య, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులకు మార్గదర్శనం చేయడంతో ఆయాశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశాయి.

ఫ హాల్‌టికెట్‌ డౌనలోడ్‌ చేసుకునేందకు అవకాశం

జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థి స్వయంగా హాల్‌ టికెట్లను డౌనలోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థి పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు నెంబర్‌ నమోదు చేసి హాల్‌ టికెట్‌ వస్తుందని, ఇందుకు సంబంధించి డీఈవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఫోన: 7981624066ను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే డెస్క్‌ను సంప్రదించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి అశ్వినీ తానాజీవాకడే తెలిపారు. నూరుశాతం ఫలితాలను సాధించే విధంగా ప్రణాళికతో విద్యాబోధన చేయడంతోపాటు నిపుణులతో సబ్జెక్టులవారీగా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేశామని అన్నారు. సెల్‌ఫోన, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు, వస్తువులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబడవన్నారు. హాల్‌టికెట్‌, ప్యాడ్‌, పెన, పెన్సిల్‌, స్కేల్‌ షార్ప్‌నర్‌, ఎరేజర్‌, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకవెళ్లవచ్చని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అర గంట ముందే తీసుకువచ్చి ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.

Updated Date - Mar 11 , 2026 | 12:53 AM