ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:45 AM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ముగియడంతో థియరీ పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 25 నుంచి మార్చి 18వ వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గురువారం హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టి వాటిని విద్యార్థులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను వెతుక్కునే సమస్య లేకుండా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసింది. దీనితో హాల్‌టికెట్‌పై ఉన్నక్యూర్ కోడ్‌ను మొబైల్ ద్వారా ఓపెన్ చేయగానే పరీక్షా కేంద్రం వివరాలతోపాటు లోకేషన్ కూడా తెలుస్తుంది.
ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతి
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయా కళాశాలల్లో చదివే విద్యార్థుల హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌చేసి ప్రిన్సిపాల్ సంతకంతో వాటిని విద్యార్థులకు అందజేస్తారు. కొన్ని చోట్ల ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తే తప్ప ఇవ్వబోమని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కరించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొంత మంది ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు హాల్‌టికెట్లపై తమ సంతకం ఉండాలని లేకుంటే పరీక్షలకు అనుమతించరని విద్యార్థులను భయాందోళనకు గురి చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి ఉండాలనే నిబంధన లేదని, ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా విద్యార్థులకు పరీక్షలకు అనుమతిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరటకలిగింది.
గతంలో పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. దీనితో వివిధ కారణాలతో చాలా మంది విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. ఈసారి నిమిషం ఆలస్యాన్ని సడలిస్తూ నిర్ణీత సమయం 9 గంటల 5 నిమిషాల వరకు అంటే 5 నిమిషాలవరకు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతించింది. పరీక్షా కేంద్రాల్లోకి పరీక్షా ప్రారంభానికి 45 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను లోనికి అనుమతిస్తారు.
పరీక్షలకు హాజరుకానున్న 36,426 మంది విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 36,426 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 18,175 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 18,251 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 37 పరీక్షా కేంద్రాలను, గ్రామీణ ప్రాంతాల్లో 20 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకోగా సమాధానపత్రాలతోపాటు ఇతర సామగ్రి, ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షల నిర్వహణ కమిటీల ఏర్పాటు
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వి గంగాధర్ కన్వీనర్‌గా హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు. వి ఆంజనేయరావు నేతృత్వంలో హైపవర్ కమిటీ, ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి సత్యవర్ధన్‌రావు, గంగాధర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ సత్యనారాయణాంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్‌లోని జూనియర్ లెక్చరర్ ఆత్మజెడిన ఆధ్వర్యంలో రెండు పరీక్షల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్ జరుగకుండా ఉండేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, నాలుగు సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారుల బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో హెల్త్‌క్యాంపు ఏర్పాటుచేసి ఫస్ట్‌ఎయిడ్ చేయాలని, తాగునీటి వసతి, గాలి, వెలుతురు వచ్చేలా చూడాలని, అనువైన ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు : వి గంగాధర్, డీఐవో
ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండర్ ఈయర్‌పరీక్షలకు విస్తృత ఏర్పాట్లుచేస్తున్నాము. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లాగిన్‌లో హాల్‌టికెట్లను పొందుపరిచారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు నేరుగా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే వెంటనే ఫిర్యాదుచేస్తే వాటిని పరిష్కరిస్తారు. పరీక్షా కేంద్రాలకు నేరుగా వెళ్లే విధంగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. దాని సహాయంతో ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. పరీక్ష సమయం కంటే కనీసం 45 నిమిషాల ముందు కేంద్రాలకు హాల్‌టికెట్లతో చేరుకుంటే ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు. ప్రైవేట్‌కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు పెడితే ఫిర్యాదు చేయాలి.