Share News

ఇటు సంతోషం.. అటు నిరీక్షణ..

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:29 AM

సన్న రకం వరి సాగు వైపు రైతులను మళ్లించడానికి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.500బోనస్‌ సంతోషాన్ని కలిగిస్తున్నది. అయితే పాత బకాయిల కోసం నిరీక్షణ నిరాశపరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే క్వింటాలుకు రూ 500 బోనస్‌ చెల్లిస్తూ వస్తున్నారు.

ఇటు సంతోషం.. అటు నిరీక్షణ..

- వానాకాలం సన్నాల బోనస్‌ రూ.5.35 కోట్లు చెల్లింపు

- ఇంకా రావాల్సింది రూ 1.26 కోట్లు

- యాసంగి ధాన్యం బోనస్‌ కోసం రైతుల ఎదురుచూపులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సన్న రకం వరి సాగు వైపు రైతులను మళ్లించడానికి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.500బోనస్‌ సంతోషాన్ని కలిగిస్తున్నది. అయితే పాత బకాయిల కోసం నిరీక్షణ నిరాశపరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే క్వింటాలుకు రూ 500 బోనస్‌ చెల్లిస్తూ వస్తున్నారు. గత యాసంగి సీజన్లో విక్రయించిన సన్న రకం ధాన్యం బోనస్‌ కోసం రైతులు దాదాపు తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్న రకం పాత బకాయిలను చెల్లిస్తామని ప్రకటించడం కొత్త రైతులకు ఉరట ఇచ్చినా, చెల్లింపులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లోనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లలో 49068 మంది రైతుల నుంచి రూ.645.61 కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 2.57 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా సన్న రకం ధాన్యం 13106 మెట్రిక్‌ లో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్న రకం ధాన్యం బోనస్‌ రూ 6.60 కోట్లు కాగా, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ 5.35 కోట్లు జమ చేశారు. బోనస్‌ రూ 1.26 కోట్లు బకాయిగా ఉంది. వీటిని కూడా త్వరలోనే జమవుతాయని చెబుతున్నారు. యాసంగి ధాన్యం బోనస్‌ కోసం రైతులు ఎదురు చూడక తప్పడం లేదు.

ఫ జిల్లాలో సన్న రకం ధాన్యం బోనస్‌ రూ 4.38 కోట్లు పెండింగ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్లో 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 44767 మంది రైతుల నుంచి రూ 624.89 కోట్లు విలువైన 2.69 లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2.60 లక్షల మెట్రిక్‌ టన్నులు, సన్నరకం 8786 మెట్రిక్‌ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం దాన్యంలో ఐకేపీ ద్వారా 7291 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 1388 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 105 మెట్రిక్‌ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1255 మంది రైతులు సన్నరకం బోనస్‌కు అర్హులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బోనస్‌ బకాయిలు రూ 4.38 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో సన్నరకం సాగుపై రైతులు మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ ఉపయోగపడుతుందని ఆసక్తి చూపిన బోనస్‌ డబ్బులు రాకపోవడంతో వానకాలం సీజన్లో సన్న రకాల సాగు తగ్గించారు. గత ఏడాది వానకాలం సీజన్‌లో జిల్లాలో 13 వేల ఎకరాల్లో సన్న రకాల సాగు చేశారు. రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500బోనస్‌ జమ చేయడంతో యాసంగి సీజన్‌లో సన్నల సాగును పెంచుకుంటూ 17 వేల ఎకరాలు సాగు చేశారు. ఆరు నెలలుగా బోనస్‌ రాకపోవడంతో జిల్లాలో వానాకాలం సీజన్‌లో 1.84 లక్షల ఎకరాలు వరి సాగు చేసిన సన్నరకం సాగు 9478 ఎకరాలకు పరిమితం అయ్యారు.

ఫ వానాకాలం సీజన్‌ 270472 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం దిగుబడి అంచనా 4.54 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. 49068 మంది రైతుల నుంచి 270472 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు ఉండగా 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోల్లు పూర్తి చేశారు. ఐకెపీ 159 కేంద్రాల ద్వారా 160745 మెట్రిక్‌ టన్నులు, 72 సింగిల్‌ విండోల ద్వారా 100881 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ఒక కేంద్రం ద్వారా 2929 మెట్రిక్‌ టన్నులు, ఏడు మెప్మా కేంద్రాల ద్వారా 5916 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండానే కొనుగోళ్లు పూర్తి చేశారు. పౌరసరఫరాల శాఖ 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా లక్ష్యం మేరకు 270472 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళు చేసింది.

ఫ రైతులకు రూ 645.61 కోట్లు చెల్లింపు...

జిల్లాలో 49068 మంది రైతుల నుంచి 270472 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. వంద శాతం రూ 645.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఐకేపీ ద్వారా రూ 383.78 కోట్లు, సింగిల్‌ విండోల ద్వారా రూ 240.70 కోట్లు, డీసీఎంఎస్‌ ద్వారా రూ.7 కోట్లు, మెప్మా ద్వారా 14.14 కోట్ల చెల్లించారు.

Updated Date - Jan 21 , 2026 | 01:29 AM