నిర్మించారు.. వదిలేశారు..
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:01 AM
అన్ని హంగులతో వేగంగా విస్తరిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురుగు శుద్ధిపై సిరిసిల్ల బల్దియ చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్ని హంగులతో వేగంగా విస్తరిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురుగు శుద్ధిపై సిరిసిల్ల బల్దియ చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న సిరిసిల్లలో అద్దకం పరిశ్రమ నుంచి వచ్చే రసాయనాల నీళ్లు, వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు కాల్వల ద్వారా ప్రవహించి మానేరు వాగులో కలిసి మిడ్ మానేరు ప్రాజెక్టులోకి చేరుకుంటున్నాయి. దీంతోపాటు చెరువులు, వ్యవసాయ భూముల్లోకి వెళ్తున్నాయి. మురుగునీరు పర్యావరణాన్ని దెబ్బతీయడం, దుర్గంధం, దోమల దాడులతో సిరిసిల్ల బల్దియా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రధాన మురుగు కాలువల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగానే మారింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకంలోనే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మానేరు వాగు దగ్గరలో శాంతినగర్ శివారు మొదటి బైపాస్ రోడ్డులో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణానికి పూనుకున్నారు. మురుగునీటి సమస్య తొలగిపోతుందని భావించిన ఎస్టీపీ నిర్మాణాల పనులు చివరి దశకు చేరుకొని నిలిచిపోయింది. ఐదేళ్లుగా సిరిసిల్ల ఎస్టీపీ మురుగు శుద్ధిపై చిత్తశుద్ధి చూపని కౌన్సిల్‌ను వెక్కిరిస్తోంది.
2022లో ఎస్టీపీ నిర్మాణ పనులు..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 2022 సంవత్సరంలో ప్రధాన మురుగు కాలువలోని నీటిని శుద్ధి చేసి మానేరు వాగులోకి పంపించే విధంగా 30 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రూ.61.25కోట్లతో పనులను ప్రారంభించారు. శాంతినగర్ శివారులో మానేరు వాగుకు దగ్గరలో ఎస్టీపీ పనులు చేపట్టారు. మొదట్లో వేగంగానే పనులు జరిగాయి. ప్రభుత్వం మారిపోవడం, మున్సిపల్ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఎస్టీపీ మూలనపడింది. ప్రధానమైన పనులు పూర్తికాగా కొంత మిషనరీ పని నిలిచిపోయింది. సిరిసిల్ల ఎస్టీపీ కాంట్రాక్టర్‌కు బిలుల్లు నిలిచిపోవడంతోనే పనులు నిలిపివేసినట్లు భావిస్తున్నారు. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. కొంత విద్యుత్ లైన్, మిషనరీ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించి రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఇందులో కొంతమేరకు బిల్లులు విడుదలైన కాంట్రాక్టర్ పనులు పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌కు మురుగునీటి నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని విమర్శలు ఉన్నాయి. 2019లో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మనగర్‌లో ప్రధాన మురుగు కాలువ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి కొత్తచెరువులోకి పంపించే విధంగా రూ.1.98కోట్లతో ఈటీపీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, నిర్మాణ లోపాలతో పనికిరాకుండా పోయింది. తర్వాత చేపట్టిన ఎస్టీపీ బకాయిలతో ముందుకు సాగకుండా నిలిచిపోయింది.
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు ఉండగా లక్షకు పైగా జనాభా ఉంది. నిత్యం సిరిసిల్లలో అద్దకం పరిశ్రమ నుంచి వచ్చే రసాయనాలు, వ్యర్థ జలాలు మురుగు కాలువల ద్వారా ప్రవహిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ నిత్యం మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, ప్రధాన కాలువ చుట్టూ పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెట్లు తొలగించకపోవడంతో మురుగునీరు ప్రవాహానికి అడ్డుగా మారుతున్నాయి. సిరిసిల్లలోని శాంతినగర్, పద్మనగర్, నెహ్రునగర్, సుభాష్‌నగర్, గాంధీనగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, గణేష్‌నగర్, తారకరామానగర్, ఇందిరానగర్, విద్యానగర్, వెంకంపేట, సర్దార్‌నగర్, సంజీవయ్యనగర్ ప్రాంతాలతో పాటు విలీన గ్రామాల్లో మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా కౌన్సిల్ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.