మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:16 AM
మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు పేర్కొన్నారు. అయోధ్యలోని శ్రీరామమందిరంలో హిందూ సమాజాన్ని అవమానించే సంఘటనలను నిరసిస్తూ మండలంలోని రామోజిపేట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మిస్తామంటే గ్రామాలలోని నిరుపేద ప్రజలు సైతం విరాళాలు ఇచ్చారని అన్నారు. వచ్చిన విరాళాలు కాకుండా, హుండీలో కూడా అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదన్నారు. ఆలయానికి వచ్చిన బంగారాన్ని కర్ణాటక రాష్ట్రంలో కరిగించగా వచ్చిన డబ్బులను కొంతమంది స్టాక్‌మార్కెట్‌లో పెట్టినట్లు తెలుస్తోందని విమర్శించారు. రామమందిర ఘటనలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లోని భక్తులందరు ఆలయాలలో కొంతసేపు మౌనదీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఓటు, సీటు చోరీ కాకుండా ఇప్పుడు హుండీ చోరీ జరుగుతోందని విమర్శించారు. శ్రీరామునికి అన్యాయం జరిగినందునే ఉద్యమిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో 35నిముషాల పాటు మౌనదీక్ష కొనసాగింది. కార్యక్రమంలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాయకులు గడ్డం నర్సయ్య, పులి కృష్ణ, సూర దేవరాజు, పాశం రాజేందర్‌రెడ్డి, పసుల వెంకటి, రమణారెడ్డి, అయిలయ్య, ఆకునూరి బాలరాజు, చొప్పరి భూమయ్య, బస్వరాజ్ జనార్దన్, మహేందర్‌రెడ్డి, తీగల పుష్పలత, ఆనందరెడ్డి, అలువాల కోటి, అంతగిరి వినయ్‌కుమార్, ప్రసాద్, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జమాల్, నరేష్‌లతో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
రామోజిపేట గ్రామంలోని శ్రీసతారామచంద్రస్వామి ఆలయంలో ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి హన్మంతరావు సమావేశానికి హాజరైన వారికి వివరించారు. ఆలయ నిర్వాహకుడు సీతారామశర్మ స్వాగతం పలికారు.
అయోధ్య ఘటనలో దోషులను శిక్షించాలి
- ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
సామాన్య భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన అయోధ్యలోని రామమందిరం ఘనటనలో దోషులను శిక్షించాలి. మతం పేరుతో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలగాలనే మౌనదీక్ష చేపట్టాం. సుపరిపాలన అంటూనే భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. భక్తుల సొమ్ము లూటీ జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు మాట్లాడం లేదు. అయోధ్యలో జరిగిన సంఘటనను కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు.
మతం పేరుతో జరిగే దోపిడీని అడ్డుకుంటాం..
- మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మతం పేరుతో జరిగే దోపిడీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. భక్తుల మనోభావాలపై ఆధారపడిన ఘటన జరిగినా కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు మాట్లాడం లేదు. రామమందిరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించడం బాధాకరం. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌లు లేవని పేర్కొనే ప్రధానమంత్రి ఆయోధ్య అక్రమాలపై ప్రజలకు వివరించాలి. ఉత్తరప్రదేశ్‌లోని బుల్డోజర్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోసం బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని దీనిని బట్టి అర్థం అవుతుంది.