పవర్ ‘ఫుల్’గా వాడేస్తున్నారు..
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:33 AM
ఎల్‌నినో విపత్తుతో వర్షాభావ పరిస్థితులకు తోడు శీతాకాలం వచ్చినా ఎండాకాలం తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ వినియోగం ఘనంగా పెరిగింది.
- ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ వినియోగం
- గత నెలలో కోటాకు మించి యూనిట్ల వాడకం
- కరెంటు కోతలు, లో-వోల్టేజి సమస్యతో జనరేటర్ల బాట
- జిల్లాలో 3 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎల్‌నినో విపత్తుతో వర్షాభావ పరిస్థితులకు తోడు శీతాకాలం వచ్చినా ఎండాకాలం తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ వినియోగం ఘనంగా పెరిగింది. ఖరీఫ్ సాగు చివరి దశకు రావడం మరోవైపు వరి కోతలు కొనసాగుతున్నాయి. చివరి దశలో పంటను కాపాడుకోవడానికి రైతులు బోరుబావుల నీటిపై ఆధారపడుతున్నారు. అట్టడుగుకు చేరిన నీటిని పంటలకు అందించడానికి పడుతున్న తండ్లాటతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ ఫీడర్లపై, ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పడుతోంది. లో-వోల్టేజి సమస్య ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గత నెల సెప్టెంబరులో 168 మిలియన్ యూనిట్ల కోటా కేటాయిస్తే 195 మిలియన్ యూనిట్లను వినియోగించారు. 27 మిలియన్ యూనిట్లు అదనంగా వినియోగించారు. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 315 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగితే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో 630 మెగావాట్లకు డిమాండ్ పెరిగింది. యూనిట్లలో చూస్తే గతనెల సెప్టెంబరులో 16 కోట్ల 80 లక్షల యూనిట్ల కోటాకు 19 కోట్ల 50 లక్షల యూనిట్లు వినియోగించారు. అదనంగా 2 కోట్ల 70 లక్షల యూనిట్లు డిమాండ్ పెరిగింది. అక్టోబరులో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగింది. శీతాకాలం వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదనపు విద్యుత్ వినియోగం కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా వర్షాలు కురిస్తే, నేలలో తేమ ఉండి పైర్లకు నీటి వినియోగం తగ్గుతుంది. బోరు బావుల్లో భూగర్భ జలాలు ఎక్కువగా ఉండి విద్యుత్ వినియోగం సైతం తక్కువగా వినియోగించేవారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌లో వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు సమృద్ధిగా చేరని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో పంటలు కాపాడుకోవడానికి బోరుబావుల వినియోగం పెరిగింది. జిల్లాలో దాదాపు 80 వేల బోరుబావులను వినియోగించడంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది.
ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి..
ఖరీఫ్ సీజన్‌లో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకమైన ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి పెరగడమే కాకుండా వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా ప్రారంభమైనప్పుడు వ్యవసాయ మోటార్లు ఒకేసారి ఆన్ చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు పడుతున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. సామర్థ్యం కంటే ఒత్తిడి పెరిగిలో వోల్టేజి సమస్య తలెత్తుతుంది. మరోవైపు మోటార్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను ఉపయోగిస్తున్నారు. జనరేటర్లను అద్దెకు తీసుకొచ్చి మోటార్లను నడుపుకుంటూ పంటలకు నీళ్లు అందించడానికి నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న దశలో బోరుబావుల ద్వారా పంటలకు నీళ్లు అందించలేని రైతులు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నారు. కరెంటు కోతల కారణంగా చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండిపోతుండడంతో రాస్తారోకో, ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. సెప్టెంబరు మాసం నుంచి కరెంటు కోతలు పెరుగుతున్న దశలో రైతులు కొట్లాటలు మొదలుపెట్టారు. కరెంటు కోతలపై ఎన్‌పీడీసీఎల్ అధికారులు మాత్రం కోతలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా సాంకేతిక కారణాల పేరుతో కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా లేకపోవడం, మధ్యమధ్యలో కోతలు విధిస్తూ ఉండడంతో చివరి పొలాలకు నీళ్లు అందని పరిస్థితి ఉంది. అధికారికంగా రాత్రివేళల్లో పూర్తిగా కోత విధిస్తున్నారు. కరెంటు కోతలకు ప్రత్యామ్నాయంగా రైతులు జనరేటర్లనేనమ్ముకున్నారు. రోజూ డీజిల్ కోసం రైతులు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొందరు రైతులు జనరేటర్ కొనుగోలు చేస్తే, మరికొందరు రోజువారి అద్దె కింద జనరేటర్లు తెచ్చుకుంటున్నారు. జనరేటర్‌కు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు.
గృహావసరాలకు పెరిగిన వినియోగం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 లక్షల పైగా వివిధ కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గత ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 1.80 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరితోపాటు కమర్షియల్ కనెక్షన్లు 23630, పారిశ్రామిక కనెక్షన్లు 3059, కుటీర పరిశ్రమల కనెక్షన్లు 4347, వ్యవసాయ కనెక్షన్లు 80 వేల వరకు ఉన్నాయి. ఇందులో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరంగా వాడుతున్నారు. దీంతోపాటు వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు విద్యుత్ సరఫరాకు ఇబ్బందికరంగా మారుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్‌పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో నిరంతరంగా విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు.