Share News

డిపోలోనే ఈ బస్సులు

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:51 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈ-బస్సులకు ఆరు రోజులుగా బ్రేకులు పడ్డాయి.

డిపోలోనే ఈ బస్సులు

- రోడ్డెక్కని ఎలకి్ట్రక్‌ బస్సులు

- మరమ్మతులు, సాంకేతిక తనిఖీల తర్వాతే సేవలు ప్రారంభం

భగత్‌నగర్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈ-బస్సులకు ఆరు రోజులుగా బ్రేకులు పడ్డాయి. కరీంనగర్‌-2 డిపోలో 104 ఎలకి్ట్రక్‌ బస్సులు ఉన్నాయి. వరుసగా ప్రమాదాలు జరగడంతో ఈ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌-2 డిపో నుంచి జేబీఎం సంస్థ ద్వారా 104 బస్సులను నడిపిస్తున్నది. జూన 21న అల్గునూరు సమీపంలో ఎలకి్ట్రక్‌ బస్సు బ్యాటరీలో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ నెల 1న కరీంనగర్‌-2 డిపోలో మరో ఎలకి్ట్రక్‌ బస్సు బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు జేబీఎం సంస్థకు పూర్తి స్థాయిలో బస్సులను తనిఖీ చేసి సాంకేతిక సమస్యలు లేవని సర్టిఫై చేస్తేనే బస్సులను నడిపిస్తామని తేల్చి చెప్పారు. ఆరు రోజులుగా కరీంనగర్‌-2 డిపో పరిధిలోని 104 బస్సులు రోడ్డెక్కడంలేదు. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేవని వంద శాతం నిర్ధారించుకున్న తర్వాతనే బస్సులను ఆయా రూట్లలో నడిపించాలని అధికారులు భావిస్తున్నారు. కరీంనగర్‌-2 డిపోలో 50 ఎక్స్‌ప్రెస్‌, 40 సూపర్‌లగ్జరీ, 10 డీలక్స్‌, నాలుగు అదనపు బస్సులు ఉన్నాయి. కరీంనగర్‌-2 డిపోకు కేటాయించిన ఎలకి్ట్రక్‌ బస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించడంతో ఎలకి్ట్రక్‌ బస్సులను పూర్తి స్థాయిలో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఫ బస్సులను పరిశీలిస్తున్న జేబీఎం అధికారులు

జూలై 1న కరీంనగర్‌-2 డిపోలో బస్సు బ్యాటరీలో మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో డిపోలో పెను ప్రమాదం తప్పింది. బస్సులకు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులు ఆదేశించడంతో జేబీఎం సంస్థ ప్రతినిధులు రోజు వారీగా అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సులన్నింటి బ్యాటరీలతో పాటు, అన్ని రకాల పూర్తి స్థాయిలో బస్సులను పరిశీలిస్తున్నారు.

ఫ వివిధ రూట్లలో అదనపు బస్సులు

కరీంనగర్‌-2 డిపోలో ఎలకి్ట్రక్‌ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు వివిధ రూట్లలో అదనపు బస్సులను నడిపిస్తున్నారు. కరీంనగర్‌-2 పరిధిలోని ఎలకి్ట్రక్‌ బస్సులు నడిచిన రూట్లలో అంచనాలు రూపొందించి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:51 AM