పాలకవర్గం లేదు.. పర్సన్ ఇన్‌చార్జీ లేడు..
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:47 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పాలకవర్గం లేక పనులు స్తంభిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పాలకవర్గం లేక పనులు స్తంభిస్తున్నాయి. బ్యాంకు పంట రుణాలకు మాత్రమే పరిమితమైంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు, స్వయం సహాయక గ్రూపులకు, కర్షక మిత్ర, వ్యాపార, వాణిజ్య, విద్య, గృహ నిర్మాణ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 200కు పైగా 10 లక్షలపై చిలుకు రుణాల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకు సీఈవోకు 10 లక్షల లోపు రుణాలు మంజూరు చేసేందుకు మాత్రమే అఽర్హత ఉండడంతో మిగతా ఫైళ్లను ఆయన పెండింగ్‌లో పెడుతున్నారు. పాలకవర్గం లేక విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక, పెద్ద రుణాల మంజూరుతోపాటు ఇతర సమస్యలనుబ్యాంకు అధికారులు ఎదుర్కోవలసి వస్తున్నది.
డిసెంబరు 18న ముగిసిన పాలకవర్గం గడువు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం గడువు 2025 డిసెంబరు 18న ముగిసింది. వెంటనే ప్రభుత్వం కలెక్టర్‌ను అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకోవడంతో నాలుగు జిల్లాల పాలకవర్గాల నేతలు వెంటనే ఎన్నికలు జరపాలి.. లేని పక్షంలో తమ పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో విచారణ జరిపిన కోర్టు ఈ సంవత్సరం మే 21న పర్సన్ ఇన్‌చార్జీల నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిగా ఉన్న కలెక్టర్ జూన్ 11న ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పాలకవర్గాన్ని నామినేట్ చేస్తుందని తెలిసింది. అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాకున్నా ఈనెలలోనే పాలకవర్గాల నియామకం ఉంటుందని ప్రచారం జోరందుకుంది.
నిర్వహణకు ఇబ్బందులు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన గొర్రెల పెంపకం, పౌలీ్ట్ర యూనిట్లు, కర్షక మిత్ర పథకం కింద రుణాలు పొందేందుకు, విద్య, హౌజింగ్ రుణాలు, ఇతర పథకాల కింద 10 లక్షలు, ఆపైన మొత్తాలకు రుణాలు పొందేందుకు 200 నుంచి 250 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. 10 లక్షల పైన రుణాలు మంజూరు చేసేందుకు పాలకవర్గ చైర్మన్‌కు మాత్రమే అర్హత ఉంటుంది. ఆలోపు రుణాలను సీఈవో మంజూరు చేస్తారు. జూన్ 11 నుంచి పాలకవర్గం కానీ పర్సన్ ఇన్‌చార్జి కానీ లేక పోవడంతో ఈ రుణాల ఫైళ్లకు మోక్షం లభించడం లేదు. సుమారు 20 కోట్ల రూపాయల మేరకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు సహాయం అందకుండా పోతున్నది. పాలకవర్గం లేక అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి లేక ఆర్థిక పరమైన విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేక పోవడంతో బ్యాంకులో ఐదు లక్షల రూపాయలకు మించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. దీంతో బ్యాంకులో వివిధ పనుల నిర్వహణ కోసం ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కేవలం పంట రుణాలకు మాత్రమే పరిమితమై ఇతర రుణాలన్నీ స్తంభించిపోవడంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తక్కువ వడ్డీకి ఇతర రుణాలు పొందే అవకాశాలు కోల్పోతూ ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే పాలకవర్గాలను నియమించడమో, ఎన్నికలు నిర్వహించడమో లేక అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిని నియమించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.