ఓట్లున్నాయి.. ఓటర్లు లేరు..
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:47 AM
జమ్మికుంట పట్టణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జమ్మికుంట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట పట్టణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదై ఉండగా, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన అధికారులకు వారు ఎక్కడా కనిపించడం లేదు. ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఒకే రాష్ట్రానికి చెందిన 150 మంది ఓటర్లు నమోదై ఉండటం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తుండగా, జాబితాలో ఉన్న పలువురు వ్యక్తులు ఆయా చిరునామాలో నివసించడం లేదని తేలింది. వారి పేర్లు మాత్రం వేర్వేరు ఇంటి నంబర్లపై నమోదై ఉన్నాయి. బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలను ఇళ్ల యాజమానులకు అందజేస్తున్నా.. అవి తిరిగి రావడం లేదు.
ఫ 39 పోలింగ్ కేంద్రాల్లో..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 39 పోలింగ్ కేంద్రాల పరిధిలో 34,455 ఓటర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు నాలుగు వేల మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి కోసం దుకాణాలు, వ్యాపార సంస్థలు, నిర్మాణ రంగంలో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పేర్లు గతంలో ఓటర్ల జాబితాలో నమోదై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వారు అక్కడ నివసించకపోవడంతో వారి ఆచూకీ లభించడం లేదు.
ఫ నిర్లక్ష్యమా.. ఉద్దేశపూర్వకంగానా..
ఇంత పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో ఎలా నమోదయ్యాయన్న ఆంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యమా, లేక ఉద్దేశ్యపూర్వకంగా కొందరు ఓటర్లుగా నమోదు చేయించుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సవరణలో ఈ ఓట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఫ సవరణతో బయటపడుతున్న వాస్తవాలు..
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కారణంగా ఇలాంటి అనుమానాస్పద నమోదులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం అర్హత లేని ఓట్లను తొలగించి, నిజమైన ఓటర్లతో జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ ఇతర రాష్ట్రాల ఓటర్లు కనిపించడం లేదు..
- గడ్డం సుధాకర్, తహసీల్దార్
ఓటర్ల జాబితాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు వారు అక్కడ ఉండడం లేదు. రాజస్థాన్‌కు చెందిన 150మంది ఓటర్లు వేర్వేరు ఇంటి నంబర్లపై ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వారెవరూ అందుబాటులో లేరు. ఇలా పట్టణ పరిధిలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది ఓటర్లు ఉంటారని ప్రాథమిక అంచనా.