తనిఖీల్లేవ్..
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:01 AM
సిరిసిల్ల నడిబొడ్డున ప్రముఖంగా పేరొందిన బాలాజీ స్వీట్ హౌస్‌లో నాలుగు రోజుల క్రితం మిక్చర్‌లో బల్లి కనిపించింది. వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించి స్వీట్ హౌస్‌ను సీజ్ చేశారు. రూ లక్ష జరిమానా విధించారు. కేసులు నమోదు చేశారు.
- పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు
- నాసిరకం వంట నూనెల వినియోగం.. రోగాల బారిన ప్రజలు
- కనిపించని ఫుడ్ సేఫ్టీ అధికారులు
- జిల్లాలో బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకులు
- పప్పులు, కారం, నెయ్యి, కల్తీకి కాదేది అనర్హం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల నడిబొడ్డున ప్రముఖంగా పేరొందిన బాలాజీ స్వీట్ హౌస్‌లో నాలుగు రోజుల క్రితం మిక్చర్‌లో బల్లి కనిపించింది. వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించి స్వీట్ హౌస్‌ను సీజ్ చేశారు. రూ లక్ష జరిమానా విధించారు. కేసులు నమోదు చేశారు.
తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో పది రోజుల క్రితం పానీపూరి తిని 29 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. బాధితులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు పరామర్శించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో కదలిక వచ్చింది.
రెండు రోజుల క్రితం తంగళ్ళపల్లిలో ఒక వైన్స్ పర్మిట్ రూంలో స్నాక్స్‌లో బొద్దింక వచ్చింది. మండెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఈగ కనిపించింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాసిరకం, కల్తీ ఆహార పదార్థాలతో అనేకమంది అస్వస్థతకు గురి అవుతున్నారు. ఫుడ్ పాయిజన్ పేరుతో నిత్యం ఆసుపత్రిలో చేరుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా సంఘటన జరిగితే తప్ప అధికారులు రోడ్డు మీదకు రారనే విమర్శలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందలాదిగా హోటల్లు, రెస్టారెంట్లు, దాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఆహారంలో నాణ్యత ప్రమాణాలు మాత్రం శూన్యం అని చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలాంటి పుణ్యక్షేత్రాలను హోటళ్లలో నాసిరకం వంట నూనెలు, కల్తీ సరుకులు, నిల్వ చేసిన వాటితోనే వంటకాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అనారోగ్య కేంద్రాలుగా హోటళ్ల కిచెన్లు..
నాణ్యమైన భోజనం, టిఫిన్లు, ఇతర స్నాక్స్ దొరుకుతాయని ఆహారప్రియులు వెళితే హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు నాసిరకమైన పదార్ధాలు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, అలాగే బకెట్ బిర్యానీలు, కేజీ బిర్యానీ.. ఇలా రకరకాల ఆఫర్లు పెట్టి భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. అనేక హోటళ్లలో మటన్, చికెన్, ఫ్రిడ్జిలో నిల్వచేసి మరుసటి రోజు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా నాసిరకం నూనెలు, నిల్వచేసిన నూనెలను మళ్లీ వినియోగిస్తున్నారు.
బడా హోటళ్లు, సూపర్ మార్కెట్లో తనిఖీలకు కరువు..
రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కల్తీ సరుకులు, తిను బండారాల వ్యాపారులపై నిత్యం తనిఖీలు జరపాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలకు రాని పరిస్థితులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో తెలియని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రధానంగా బడా హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్దపెద్ద సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు తక్కువగానే కనిపించడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. నిత్యం చిరు వ్యాపారులపైనే ప్రతాపం చూపిస్తారనే విమర్శలు ఉన్నాయి. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో నాసిరకం సరుకుల అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి.
కల్తీ మాయ..
కల్తీ మాయలో ఏది నాణ్యతో తెలియని పరిస్థితి. బ్రాండెడ్ కవర్లలో కల్తీ సరుకులు.. కారంపొడి, టీ పొడి, మసాలా పోడులు ఏ పొడులైనా కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో భీతిగొలిపే విధంగా కల్తీ సాగిపోతోంది. గతంలో పోలీస్, టాస్క్‌ఫోర్స్ దాడుల్లో భారీ కల్తీ నిల్వలు బయటపడ్డాయి. భారీ ఎత్తున కల్తీ నూనె బయటపడి అందరిని ఆశ్చర్యపరిస్తే లక్షల విలువైన కల్తీ సరుకుల ప్యాకింగ్ కేంద్రం వెలుగులోకి వచ్చింది. పండుగల సమయంలో కల్తీ నూనె, కల్తీ నెయ్యి, బ్రాండెడ్ కంపెనీల కవర్లలోనే మార్కెట్‌లోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో రేడిమేడ్‌గా దొరుకుతున్నాయని మసాలా పొడులను కొంటే కల్తీతో మోసపోతున్నారు. అల్లం, మసాలా, పొడుల్లో భారీగా మోసం జరుగుతోంది. అల్లం పేస్ట్‌లో అలుగడ్డ కలిపేస్తున్నారు. చివరకు పాలల్లో కూడా గంజి, పాలపొడి, సోడియం కార్బొనేట్, యూరియా, అమ్మోనియా వంటి రసాయనాలు కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. మిరప పొడిలో ఇటుకపొడి కూడా కలుస్తోంది. కాఫీ పొడిలో చింతగింజల పొడి కలిసిపోతున్నాయి. గతంలో సిరిసిల్ల పట్టణంలోనే కల్తీ పొడుల తయారీ బ్రాండెడ్‌గా ఉండే కవర్లలో ప్యాక్ చేసి విక్రయించే కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కేసుల్లో పలువురిని ఆరెస్ట్ చేసినా ఈ వ్యవహారం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది. 2006 ఆహారపు పరిరక్షణ ప్రమాణపు చట్టం ప్రకారం, 2011 నిబంధనలు నియమావళి చట్టం ప్రకారం పరిరక్షణ లేని ఆహార పదార్థాలను తయారుచేసినా, అమ్మినా, నిల్వఉంచినా, సరఫరాచేసినా, దిగుమతి చేసుకున్నా, లైసెన్స్ లేకపోయినా చట్టరీత్యా శిక్ష పడుతుంది. కానీ జిల్లాలో వ్యాపారులు తమకు ఏమీ పట్టనట్లుగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నా అఽధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.