Share News

కరీంనగర్‌ యువత కొదమసింహాలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:46 AM

: పోరాటాలు, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌ అని.. ఇక్కడి యువత కదన రంగంలో కొదమ సింహాలని.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో యువసమరభేరీ సమావేశం శనివారం నిర్వహించారు.

కరీంనగర్‌ యువత కొదమసింహాలు

కరీంనగర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోరాటాలు, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌ అని.. ఇక్కడి యువత కదన రంగంలో కొదమ సింహాలని.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో యువసమరభేరీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సాధనకు కరీంనగర్‌ నాంధి పలికిందని.. ఇక్కడి నుంచే కేసీఆర్‌ తన పోరాటాన్ని ప్రారంభించారన్నారు. ఢిల్లీ మెడలు వంచిన ఘనత కరీంనగర్‌ది అని కొనియాడారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసమే ఈ సమరభేరీ మోగిస్తున్నామన్నారు. దేశంలోనే యంగెస్ట్‌ రాష్ట్రం తెలంగాణ అని.. గత బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరాయని చెప్పారు. ఇంకా కొన్నింటి సాధన దిశగా అడుగేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌ సర్కారు హయంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబైర్స్‌మెంట్‌ కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల వేదనలు వర్ణనాతీతమన్నారు. వీరి పోరాటాలకు అన్ని వేళలా బీఆర్‌ఎస్‌ అండగా నిలబడుతుందన్నారు. విద్యార్థుల విద్య, సంక్షేమం, సాంకేతికత విషయంలో తమ ప్రభుత్వం బాగా పనిచేసిందన్నారు. కరీంనగర్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాల్ని కల్పించాలని ఐటీ టవర్‌ను నిర్మించామన్నారు. ఇక్కడ ఐటీ టవర్‌ ఉన్నా.. దానిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కసారి కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన ఐటీ మంత్రి అక్కడికి వెళ్లి ఐటీ టవర్‌ను పరిశీలించలేదన్నారు. ఉద్యోగ కల్పన, సంస్థల స్థాపన విషయంలో చొరవ తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యువతను మోసగిస్తున్నాయని, అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేసేందుకు యువత సిద్ధమవ్వాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఫ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌..

కేటీఆర్‌ హాజరైన యువ సమరభేరీ సభ విజయవంతమవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది. పెద్దఎత్తున విద్యార్థులు, యువత, నిరుద్యోగులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను వేదిక మీద దృశ్యరూపకంగా వీడియోలు ప్రదర్శించినప్పుడు యువత నుంచి స్పందన లభించింది. కేటీఆర్‌ తన ప్రసంగం మధ్యలో వీటిని చూపిస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థులు వేదిక మీద మాట్లాడుతూ తమ ఇబ్బందులరె కేటీఆర్‌కు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పర్యవేక్షణలో సమరభేరీకి ఏర్పాటు చేయగా.. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని తనదైన శైలిలో విమర్శిస్తూ కేటీఆర్‌ కొనసాగించిన ప్రసంగానికి పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. కేటీఆర్‌ సహా ముఖ్య నాయకులంతా నల్లరంగు టీషర్టులను ధరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సభావేదికపైకి వస్తున్న కేటీఆర్‌కు స్థానిక నాయకులు ఘన స్వాగతాన్ని పలికారు. కరచాలనం చేసేందుకు యువత పోటీ పడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లాధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్లు పొన్నం అనిల్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, మండల మాజీ వైస్‌ప్రెసిడెంట్‌ తిరుపతినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:46 AM