‘రవాణా’ శాఖ ఖజానా గలగల
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:16 AM
జిల్లా రవాణా శాఖకు ఆశించిన రీతిలోనే ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ ఖజానా గలగలలాడింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జిల్లా రవాణా శాఖకు ఆశించిన రీతిలోనే ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ ఖజానా గలగలలాడింది. రవాణా శాఖకు రూ 36.06 కోట్లు ఆదాయం వచ్చింది. ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు అమ్మకాలు పెరగడంతో రవాణా శాఖ ఆదాయం పెరగకపోయినా గడిచిన సంవత్సరాల్లో వచ్చిన ఆదాయం ఈసారి కూడా సమకూరిందని చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.33.08 కోట్లు ఆదాయం లభించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో రూ.37.70 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.44.08 కోట్లు ఉండగా ఆదాయం రూ.37.05 కోట్లు సమకూరింది. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ 45.96 కోట్లుగా పెంచినప్పటికీ 78.46 శాతంగా ఆదాయం రూ 36.06 కోట్లు వచ్చింది. ఇందులో త్రైమాసిక ట్యాక్స్ రూపంలో లక్ష్యం రూ 8.28 కోట్లుకు రూ 7.12 కోట్ల ఆదాయం సమకూరింది. లైఫ్ ట్యాక్స్ లక్ష్యం రూ 27.48 కోట్లు కాగా రూ 20.75 కోట్లు, సర్వీస్ ఫీజుల లక్ష్యం రూ.1.68 కోట్లుగా రూ 1.79 కోట్లు లభించింది. గ్రీన్‌ట్యాక్స్ లక్ష్యం రూ 6 లక్షలు కాగా రూ 61 లక్షల ఆదాయం వచ్చింది. జరిమానాల ద్వారా రూ 1.8 కోట్లు లభించాయి.
వ్యక్తిగత వాహనాల వైపు ఆసక్తి...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల జనాభా ఉంది. దాదాపు 1.77 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాహనాలు కూడా 1,57,625 వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఎలక్ర్టానిక్ వాహనాలపై ప్రజలు ఆసక్తి పెరిగింది. జిల్లాలో ద్విచక్రవాహనాలు 109537, కార్లు 15259, స్కూల్ బస్సులు 169, రవాణా క్యాబ్‌లు 89, లగ్జరీ టూరిస్ట్ క్యాబ్‌లు 11, జీపులు 12, మోటార్ క్యాబ్‌లు 1371, ప్రైవేటు ఓమినీ బస్సులు 225, రోడ్ రోలర్‌లు 2, స్టేజీ క్యారియర్‌లు, మోపెడ్ అండ్ మోటారైజ్‌డ్ సైకిల్ 4959, త్రీవిలర్ గూడ్స్ వాహనాలు 1515, వ్యవసాయ ట్రాక్టర్‌లు 6020, కమర్షియల్ ట్రాక్టర్‌లు 4785, సరుకుల రవాణా వాహనాలు 3818, ప్రైవేటు క్రేన్‌లు 9, కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వాహనాలు 240, హార్వెస్టర్‌లు 670, అంబులెన్స్‌లు 45, ఆటోలు 3921లతో పాటు ఇతర వాహనాలు కూడా జిల్లాలో పెరిగాయి.
ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు సకాలంలో చెల్లించుకోవాలి..
- లక్ష్మణ్, జిల్లా రవాణాశాఖ అధికారి
వాహనాల యజమానులు ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు సకాలంలో చెల్లించుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు పరిహారం పొందే వీలుంటుంది. ట్యాక్స్‌ల చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా రవాణా శాఖ ఆదాయం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ 36.06 కోట్లు వచ్చింది. వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్, ట్యాక్స్‌లు, చెల్లించాలి.