Share News

పూల పండుగకు వేళాయే...

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:49 AM

పల్లెలు పండుగ శోభను సంత రించుకోనున్నాయి. ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ.. భక్తిశ్రద్ధలతో కొలిచే దేవీ శరన్నవరాత్రులు.. విజయదశమి వేడుకలు.. ఇలా పండుగల సందడి మొదలుకానుంది.

పూల పండుగకు వేళాయే...

పూల పండుగకు పుట్టింటికి ఆడపడుచులు

దేవీ నవరాత్రులతో భక్తి పారవశ్యం

18న సద్దుల బతుకమ్మ.. 20న విజయదశమి

పెద్దపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పల్లెలు పండుగ శోభను సంత రించుకోనున్నాయి. ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ.. భక్తిశ్రద్ధలతో కొలిచే దేవీ శరన్నవరాత్రులు.. విజయదశమి వేడుకలు.. ఇలా పండుగల సందడి మొదలుకానుంది. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికే పండుగ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బతుకమ్మ ఆడే ప్రదేశాలు ముస్తాబవుతున్నాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు పుట్టింటికి తరలివస్తారు. కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, బంధువులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచుల రాకతో గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంటుంది.

ఫ పూల పండుగకు ప్రత్యేకత

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేర్చి, సాయంత్రం మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటారు. ప్రకృతి, నీరు, మట్టి, పూలతో ప్రజలకు ఉన్న అనుబంధాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తుంది. బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఫ తొమ్మిది రోజులూ ప్రత్యేకమే

బతుకమ్మ ఉత్సవాలు శనివారం ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. చిన్న బతుకమ్మల నుంచి పెద్ద బతుకమ్మల వరకు రోజుకో ప్రత్యేకతతో వేడుకలు నిర్వహిస్తారు. చివరి రోజైన 18న సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోనున్నారు.

ఫ దేవీ శరన్నవరాత్రుల వైభవం

బతుకమ్మతో పాటు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రధాన దేవాలయాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లోనూ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ దసరా పెద్ద పండుగ

నవరాత్రుల అనంతరం ఈనెల 20 మంగళవారం విజయదశమి జరగనుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాను నిర్వహించడం ఆనవాయితీ. తెలంగాణలో దసరాకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లడం, జమ్మి చెట్టును పూజించడం, పెద్దలను కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం, పరస్పరం జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఫ పండుగ.. కుటుంబాల కలయిక

బతుకమ్మ, దసరా పండుగలు కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు.. కుటుంబాలను, బంధుత్వాలను కలిపే వేడుకలు. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు పండుగ సందర్భంగా స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులు పుట్టింటికి రావడంతో గ్రామాల్లో పాత జ్ఞాపకాలు, ఆత్మీయ పలకరింపులు, బంధుత్వాల సందడి కనిపిస్తుంది.

ఫ తెలంగాణ పల్లెల్లో పండుగ వాతావరణం

జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పండుగ ఏర్పాట్లు మొదలయ్యాయి. బతుకమ్మ ఆడే ప్రదేశాలను శుభ్రం చేయడం, ఆలయాలను విద్యుద్దీపా లతో అలంకరించడం, ఉత్సవ కమిటీల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్లలో పూలకు డిమాండ్‌ పెరగడంతో పూల వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:49 AM