Share News

‘సన్న రకం’ ముద్దు

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:05 AM

వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి ధాన్యం సాగు చేయాలని అధికారులు, మిల్లర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

‘సన్న రకం’ ముద్దు

జగిత్యాల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి ధాన్యం సాగు చేయాలని అధికారులు, మిల్లర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొంత కాలంగా ఎఫ్‌సీఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) సేకరణలో సన్న బియ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో జిల్లాలోని మిల్లుల్లో దొడ్డు రకం బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వచ్చే వానాకాలం సీజన్‌లోనైనా వంద శాతం సన్నరకం వరి ధాన్యం పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ముందస్తుగా నడుం బిగించారు. జిల్లా బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్న రకాల సాగు ప్రాధాన్యతపై రైతులకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఫపేరుకుపోయిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు..

జిల్లాలో పలు రైస్‌ మిల్లులలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. జిల్లాలోని రైస్‌మిల్లుల్లో మూడు సీజన్‌లకు చెందిన సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు, సీఎంఆర్‌ బియ్యం నిల్వలున్నాయి. దీనికి తోడు రానున్న వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్న 2025-26 యాంసగి ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాల్సి ఉంది. మిల్లుల్లో ఇప్పటికే పెద్దఎత్తున ధాన్యం ఉన్నందున యాసంగి సీజన్‌లో వరి ధాన్యం సేకరణ నుంచి తమను మినహాయించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు మాకునూరి సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల సంజయ్‌, ఆది శ్రీనివాస్‌, మేడిపల్లి సత్యంలతో పాటు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతలకు రైస్‌మిల్లర్ల సంఘ నేతలు నవీన్‌రావుతో పాటు పలువురు మిల్లర్లు ఇటీవల వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ అధికారుల సూచనల మేరకు ధాన్యం సేకరణకు సంబంధించిన పలు సమావేశాలకు మిల్లర్లు హాజరవుతున్నారు. ఒకవేళ యాసంగి వరి ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాల్సి వస్తే మరో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు చేరుతుంది. దీంతో పాత నిల్వలకు తోడుగా కొత్త నిల్వలు మిల్లుల్లో పేరుకుపోయే అవకాశాలున్నాయి.

ఫప్రశ్నార్థకంగా మారిన వానాకాలం సీజన్‌ సేకరణ..

జిల్లాలోని రైస్‌మిల్లుల్లో భారీ ఎత్తున ధాన్యం, సీఎంఆర్‌ బియ్యం నిల్వలు పేరుకుపోతుండడంతో రానున్న వానాకాలంలో పండించే ధాన్యం సేకరణ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లయింది. వచ్చే రెండు నెలల్లో జిల్లాలో వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభం కానుంది. జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న కారణంగా ప్రధానంగా వరి సాగు అవుతోంది. ఇందులో దొడ్డు ధాన్యం రైతులు అధికంగా పండిస్తున్నారు. దొడ్డు బియ్యం సేకరణ ఎఫ్‌సీఐ చేయకపోవడం ఇబ్బందిగా తయారైంది. వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులు దొడ్డు బియ్యం సాగు చేస్తే ధాన్యం సేకరణ ఎలా చేయాలన్న ఆందోళన మిల్లర్లతో పాటు అధికారుల్లో చోటుచేసుకుంటోంది. దీంతో ప్రత్యామ్నాయంగా సన్నరకాల సాగు వైపు అన్నదాతలను ప్రోత్సహించ డానికి ముందస్తు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫసన్నాలకు డిమాండ్‌..

కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తోంది. జిల్లాలో ప్రతీ నెల 3,52,072 రేషన్‌కార్డుల్లోని 10,27,397 మంది లబ్ధిదారులకు 70వేల కిలోల సన్న బియ్యం అందిస్తోంది. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సన్న బియ్యాలను సరఫరా చేస్తోంది. దీంతో సన్నాలకు డిమాండ్‌ పెరిగింది. రైతులు దొడ్డు ధాన్యం పండిస్తుండం కారణంగా సన్నాలు సేకరణ స్వల్ప సంఖ్యలో ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, రేషన్‌ దుకాణాలు, అంగన్‌ వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు సన్న బియ్యం సరఫరా చేయాల్సి వస్తోంది. సన్న రకాలు సాగు చేస్తేనే ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశాలున్నాయని మిల్లర్లు అంటున్నారు. దీంతో ప్రభుత్వం సన్న బియ్యం సక్రమంగా సరఫరా చేసే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఫపొరుగు జిల్లాల్లో 90 శాతానికి పైగా సన్నాల సాగు..

పొరుగు జిల్లాలైన పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో 90 శాతానికి పైగా సన్నాలు సాగు చేస్తున్నారు. జగిత్యాలలో గత వానాకాలం సీజన్‌లో 3.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా ఇందులో సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల మాత్రమే సన్నాలు సేకరించారు. రెండేళ్ల క్రితం వానాకాలం సీజన్‌లో సుమారు 4లక్షల మెట్రిక్‌ టన్ను ధాన్యం సేకరించగా ఇందులో సుమారు 30వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సన్నాలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంబంధించిన టార్గెట్లు సక్రమంగా ఇవ్వకపోవడం, మిల్లుల్లో నిల్వలు పేరుకపోవడం, ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకపోవడం తదితర కారణాల వల్ల బియ్యం సేకరణ ఇబ్బందిగా తయారైంది.

ఫరైతుల్లో అవగాహనకు ప్రయత్నాలు..

జిల్లాలో వచ్చే వానాకాలం సీజన్‌లో సన్న రకాలను సాగు చేయాలని మిల్లర్లు కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్‌ పోస్టర్లు, సదస్సులను నిర్వహిస్తున్నారు. సన్నాలు పండిస్తే వెంటనే మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్‌ అప్పగించే అవకాశాలుండడంతో మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు ఇవ్వడం, సీఎంఆర్‌ అప్పగించడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. సన్నాలు సాగు చేయడం వల్ల రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందిస్తోంది. ఈ అంశంపై ఇటీవల కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, వ్యవసాయ శాఖ అధికారులకు మిల్లర్లు విన్నవించుకోవడంతో సన్నాల సాగు వైపు రైతులను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా లక్ష కరపత్రాలు, 2,500 పోస్టర్లు, వెయ్యి బ్యానర్లు ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు, రైతు వేధికలు, రైతు సంఘాల భవనాలు, ధాన్యం సేకరణ కేంద్రాలల్లో పోస్టర్ల ప్రదర్శన చేయనున్నారు. సీడ్‌ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి డీలర్‌ పాయింట్‌ వద్ద పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ అధికారులు, తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు, సీడ్‌ డీలర్లను భాగస్వామ్యం చేస్తూ సన్నాల సాగు ప్రాధాన్యత అంశాలను రైతులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వంద శాతం సన్నాలు సాగు చేయాలన్న లక్ష్యంతో ముందస్తుగా చేస్తున్నా ఏ మేరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే.

Updated Date - Apr 14 , 2026 | 01:05 AM