అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలే లక్ష్యం
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:26 AM
తన పార్లమెంట్ స్థానంపై పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు కరీంనగర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకొని అమలు చేస్తు న్నారు. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 40 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నారు. శనివారం కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి దేవాలయం నుంచి ఉదయం 6 గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
- ఇటు ఆశీర్వాదం... అటు అధికారం
- పట్టు నిలుపుకునేందుకు పకడ్బందీ వ్యూహం
- నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్ర
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తన పార్లమెంట్ స్థానంపై పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు కరీంనగర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకొని అమలు చేస్తు న్నారు. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 40 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నారు. శనివారం కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి దేవాలయం నుంచి ఉదయం 6 గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. బండి సంజయ్‌కుమార్ స్వయంగా ఈయాత్రలో ముందు నడువ నుండగా ఇటీవల ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డుసభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లాలోని బీజేపీ కీలకనేతలు, వివిధ విభాగాల నాయకులు, దారిపొడువునా ఆయా గ్రామాల బీజేపీశ్రేణులు, ప్రజలు పాల్గొనేలా యాత్రను రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతలు దీనికి తరలివస్తారని తెలుస్తున్నది.
ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలు
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారు. అటు పంచాయతీ ఎన్నికల్లో ఇటు మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించి బీజేపీ అధికార కాంగ్రెస్‌కు, విపక్ష బీఆర్‌ఎస్‌కు తక్కువేమీ కాదని సవాల్ విసిరింది. జిల్లా వ్యాప్తంగా 108 మంది సర్పంచులు, 450 మంది వార్డుసభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆ పార్టీ గెలిపించుకున్నది. సంస్థాగతంగా పోలింగ్ బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను వేసుకొని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్తూ పార్టీశ్రేణులు కీలకపాత్ర వహిస్తున్నారు. ఆ కారణంగానే పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ గ్రామస్థాయి ల్లో కూడా వేళ్లూనుకొని స్థానిక సంస్థల్లో ఇతర పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా స్థానాలను గెలుచుకున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సైతం పకడ్బందీ వ్యూహంతో ఎదుర్కొని పలు మండలాలను, అవసరమైతే కరీంనగర్ కార్పొరేషన్ లాగానే జడ్పీ చైర్మన్ పదవి కూడా దక్కించుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతున్నది.
రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్రపై దృష్టి
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడుసార్లు పరాజయం పాలైన బండి సంజయ్‌కుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వరుస విజయాలతో కేంద్రమంత్రి పదవి చేపట్టారు. అయినా ఆయనకు ఆ విజయం సంతృప్తిని ఇవ్వడం లేదని, మూడుసార్లు ఓడిన అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలపాత్ర నిర్వహించాలని పార్టీకి అత్యధిక స్థానాలు వస్తే ఇదివరకే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవానికి తోడు కేంద్రమంత్రి పదవిని నిర్వహిస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి పదవికి పోటీపడాలన్నది బండి సంజయ్‌కుమార్ అసలు లక్ష్యంగా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆ లక్ష్య సాధన దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్లు ఇటీవల ఆయన పార్టీ వ్యవహారాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపుతున్న చొరవ సూచిస్తున్నది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మూడుసార్లు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా, ఒకసారి టీడీపీ అభ్యర్థిగా వరుస విజయాలను నమోదు చేసుకున్నారు. ఆయన మళ్లీ తన స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 75శాతం ఓట్లు కార్పొరేషన్ పరిధిలోనే ఉండడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్‌ఎస్‌కు చేదు ఫలితాలను చవిచూపాయి. 66 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో బీజేపీ 30 స్థానాలను గెలుచుకోగా ఆ తర్వాత ముగ్గురు బీజేపీలో చేరారు. మెజార్టీ ఇండిపెండెంట్లు ప్రస్తుతం బీజేపీ వెంటే ఉన్నారు. దీనితో ఆ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకోవడమే కాకుండా బలమైన శక్తిగా ఎదిగింది. దీనితో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజక వర్గాన్ని దక్కించుకోవడం పెద్ద కష్టమేమీకాదని, ఆలోగా పార్టీని ప్రజల వద్దకు మరింత దగ్గరగా తీసుకవెళ్లేందుకు ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక స్కెచ్ వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరినీ ఒకచోటకు చేర్చి రాజకీయ అవగాహన కల్పించడంతో పాటు బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీ వెంట ఉండి గ్రామాలను తమతమ డివిజన్లను అభివృద్ధి పరుచుకోవాలని, ప్రజల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని వారికి చెప్పి పార్టీ సంస్థాగత కార్యక్రమాల అమలు దిశగా అడుగులు వేయిస్తున్నారు. కరీంనగర్ కార్పొ రేటర్లతో హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు జరిపి పార్టీ విజయాలను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు.
పాదయాత్రకు ఏర్పాట్లు
కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ఇప్పటికే కాషాయజెండాలు, ఫ్లెక్సీలు, స్వాగతతోరణాలు, ద్వారాలు ఏర్పాటు చేసి కాషాయమయం చేశారు. ప్రతియేటా చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతులకు వివిధ ప్రాంతాల నుంచి అంజన్న భక్తులు పాదయాత్రగా కొండగట్టు క్షేత్రానికి చేరుకునే ఆనవాయితీ ఉన్నది. ఈ సంవత్సరం అందుకు తోడుగా మూడవదిగా ఈ ఆశీర్వాదయాత్ర వందలాది మందితో సాగనున్నది. బండి సంజయ్‌కుమార్ ప్రతియేటా హనుమాన్ ర్యాలీలు తీసే ఆనవాయితీ ఉన్నది. అయితే ఈసారి 40 కిలోమీటర్ల పాదయాత్ర రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.