Share News

రైతుకు వరుణుడి అండ

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:02 AM

రైతులకు వర్షం అండగా నిలిచింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవని జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే హెచ్చరించినా జిల్లా రైతాంగం మాత్రం వరిసాగు వైపే మొగ్గు చూపారు.

 రైతుకు వరుణుడి అండ

పెద్దపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతులకు వర్షం అండగా నిలిచింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవని జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే హెచ్చరించినా జిల్లా రైతాంగం మాత్రం వరిసాగు వైపే మొగ్గు చూపారు. మొదట్లో భయపడినా వరుణిడి కరుణ లభించింది. వరి పంటలు ఎండిపోతున్న సందర్భంలో.. కొద్దోగొప్పో వానలు కురిసి రైతుల పంటలకు ప్రాణం పోస్తున్నాయి. రెండు రోజులలో కురిసిన వర్షాలకు ఎండిపోతున్న వరిపంటలు ఊపిరి పోసుకున్నాయి. ఇక మరో రెండు ధఫాలుగా వానలు కురిస్తే తమ పంటలు ఇంటికి వస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఎల్‌నినో భయాలన మధ్య సాగు

ఈ సీజన్‌లో ఎల్‌నినో భయాల మధ్య రైతులు సాగు మొదలుపెట్టారు. వ్యవసాయశాఖ అధికారులు చేసిన సూచనలు జిల్లా రైతాంగాన్ని కొంతకాలం తీవ్రఆందోళనకు గురిచేశాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, కరువు పరిస్థితులు తలెత్తవచ్చని, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, వరి సాగును సాధ్యమైనంత మేరకు తగ్గించాలని సూచించారు. వానాకాలం ప్రారంభమైనా తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అధికారుల హెచ్చరికలు నిజమవుతున్నాయేమోనన్న భయం రైతుల్లో మొదలైంది. అనూహ్యంగా మూడు రోజుల వర్షాలతో పరిస్థితి మారిపోయింది.

ఫ భయపెట్టిన ఎండలు..

ఒక దశలో ఎండల తీవ్రత పెరిగి వరిమడులు బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. పంట ఎండిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందారు. ఇక ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని భావించారు. అయితే ప్రకృతి మరోసారి రైతులకు అండగా నిలిచింది. పంట ఎండిపోయే దశకు చేరుకున్న ప్రతిసారీ ఏదో ఒక సమయంలో వర్షం కురవడం.. పొలాల్లో నీరు చేరడం..తేమ ఉండడం తిరిగి పంటలకు ప్రాణం రావడం పలుమార్లు జరిగింది. దీంతో రైతుల ఆశలు నిలిచాయి.15రోజుల క్రితం కురిసిన వర్షాలు కూడా ఎండిపోతున్న వరిపంటలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. తాజాగా ఆదివారం కురిసిన వర్షం కూడా వరి పంటకు మరింత ఉపయోగపడింది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వరి పంట పొట్ట దశకు చేరుకుంటుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఫ మరో రెండు వానలు పడితే..

ప్రస్తుతం పంట కీలకదశలో ఉంది. వరిపొట్ట దశకు చేరుకుంటున్న సమయంలో తగినంత తేమ ఉండటం రైతులకు ఎంతో అవసరం. రానున్న రోజుల్లో మరోరెండు మంచి వర్షాలు కురిస్తే పంట చేతికి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని రైతులు ఆశిస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళన మాత్రం ఇంకా వీడలేదు.

ఫ రైతులకు అండగా ఎమ్మెల్యే..

మరో నెల రోజులలో వరి పంట చేతికి వచ్చే తరుణం ఉండడంతో ఒకవేళ వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటన్న విషయంలో ప్రభుత్వవిప్‌ విజయరమణారావు అధికారులతో మంతనాలు జరుపు తున్నట్లు సమాచారం. ఎలాగైనా రైతుల పంటలను కాపాడేందుకు చివరి యత్నంగా రెండు మూడు తడుల సాగునీటిని రైతులకు ఇప్పించేందుకు ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. వచ్చేనెల మొదటి వారంలో కానీ ఈనెలాఖరులో గానీ కాలువ ద్వారా నీరందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఫ జిల్లాలో ఇప్పటివరకు వరిసాగుకు ఇబ్బందేమీ లేదు..

- శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో 2లక్షల 15వేల ఎకరాలలో రైతులు వరిపంట సాగుచేశారు. అయినా ఎక్కడావరి పంటలు సాగు నీరందకఎండిపోయిన పరిస్థితులు లేకుండాపోయాయి. ముందు ముందు ఆ పరిస్థితి ఏర్పడ వచ్చని అంచనా. కానీ రైతులు మొదటినుంచి వరుణుడి కరుణ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలాగని రైతులుకు వరుణుడి కరుణ కూడా ఇప్పటివరకూ లబిస్తూ వస్తున్నది. చివరి దశలో పంటలను కాపాడేందుకు కాలువ నీటి విడుదలను కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అలోచిస్తున్నది.

Updated Date - Sep 22 , 2026 | 02:02 AM