ఎండ.. కనికరం లేకుండా..
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:00 AM
వామ్మో ఇవేమి ఎండలు... నిప్పుల కుంపటిని తలిపిస్తున్నాయి.. జూన్ నెల సగం గడిచినా.. ఒక్క వర్షం కురవలేదు.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.. బయటకు వెళితే వడగాల్పులు... ఇంట్లో ఉంటే ఉక్కపోత... ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం పనిచేయడం లేదు... ఏసీ ఉంటేనే కొంత ఉపశమనం... ఏసీ నుంచి బయటకు వస్తే నరకమే.. జిల్లావ్యాప్తంగా ఇదే పరేస్థితి.. వర్షాలు కురిపించు దేవుడా అంటూ ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు చూస్తున్నారు.
కరీంనగర్ టౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): వామ్మో ఇవేమి ఎండలు... నిప్పుల కుంపటిని తలిపిస్తున్నాయి.. జూన్ నెల సగం గడిచినా.. ఒక్క వర్షం కురవలేదు.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.. బయటకు వెళితే వడగాల్పులు... ఇంట్లో ఉంటే ఉక్కపోత... ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం పనిచేయడం లేదు... ఏసీ ఉంటేనే కొంత ఉపశమనం... ఏసీ నుంచి బయటకు వస్తే నరకమే.. జిల్లావ్యాప్తంగా ఇదే పరేస్థితి.. వర్షాలు కురిపించు దేవుడా అంటూ ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు చూస్తున్నారు. రెండు, మూడు రోజులు ముఖ్యంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో ఎండ తీవ్రత తీవ్రంగా ఉంది. బయట అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. కూలీ పనులు చేసుకుని బతికే కార్మికులు, వీధి వ్యాపారులు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎండల తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితిలో రోడ్లపై ఉండాల్సి వస్తోందని, వర్షాకాలంలో ఈ ఎండలు ఇలా ఉంటే బతికేదెలా అంటూ వాపోతున్నారు. రోహిణి కార్తె పోయి మృగశిర కార్తె వచ్చి 10 రోజులవుతున్నా వర్షాలు పడక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు వడగాలులు వీస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్లు, టవర్‌సర్కిల్, కమాన్ వంటి ప్రాంతాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ ఎండలు ఇలాగే ఉంటే కష్టమేనని ప్రజలు వాపోతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్ల రసాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.