ఎండలు బాబోయ్
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:45 AM
ఇవేమి ఎండలు రా.. బాబోయ్.. అంటూ జనం విలవిల్లాడుతున్నారు.
- ఇంట్లో ఉక్కపోత
- బయట నిప్పుల కొలిమి
- మరో నాలుగైదు రోజులు మరింత పెరిగే అవకాశం
- 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
- విలవిలలాడుతున్న జనం
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఇవేమి ఎండలు రా.. బాబోయ్.. అంటూ జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకోగా సోమ, మంగళవారం 42 డిగ్రీలపైబడి నమోదయ్యాయి. ఏప్రిల్ రెండవ వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఈనెలాఖరుల, మే మాసంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు చేరుకుంటాయని, ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఉదయం 10 తర్వాత బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాను ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగినందున ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవడం శ్రేయస్కరమని, ఆ తర్వాత 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, మండలాల్లో చలివేంద్రాల ఏర్పాటు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లోనూ తాగునీరు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. తప్పనిసరి బయటకు రావలసి వస్తే తలపై టోపీ, పాగా, రుమాలు చుట్టుకోవాలని, ఏదైనా వస్త్రం ధరించాలని సూచించారు.
రోడ్డపై తగ్గిన జనం
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లా కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ రోడ్, తెలంగాణచౌక్, కమాన్‌చౌరస్తా, మార్కెట్, టవర్‌సర్కిల్, మంకమ్మతోట, రాంనగర్, జ్యోతినగర్, కోర్టు చౌరస్తా, సివిల్ హాస్పిటల్ చౌరస్తాతో పాటు అన్ని రోడ్లలో జనం లేక వెలవెలబోయాయి. రాత్రి 7 గంటల వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా ఉదయం 7గంటల నుంచే వేడిగా వడగాల్పులు వీచడంతో ఓ వైపు ఎండల వేడిమి, మరోవైపు వేడిగాలితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో నాలుగైదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైబడి నమోదవుతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అడుగంటిన భూగర్భజలాలు
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. కరీంనగర్‌కు వరప్రదాయిని లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండి)లో నీటి మట్టం రోజురోజుకు పడిపోతున్నది. 24.034 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 7.039టీఎంసీల నీరు ఉన్నది. నీటి ఎద్దడి నివారణ కోసం మిడ్ మానేరు నుంచి కానీ కాళేశ్వరం నుంచి కానీ కనీసం 10 టీఎంసీల నీరు ఎల్‌ఎండీలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ నీటిపారుదలశాఖ అధికారులకు లేఖ రాశారు. అంతేకాకుండా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎల్‌ఎండిలో నీటి నిలువలు, నగరంలో మంచినీటి సరఫరా, భవిష్యత్‌లో తలెత్తనున్న నీటి ఎద్దడి సమస్యలను వివరించారు. దీనితో ఆయన వెంటనే రాష్ట్ర నీటిపా రుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడటమే కాకుండా కరీంనగర్‌లో రోజూ విడిచి రోజు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా ఎల్‌ఎండీలో కనీసం నీటి నిలువలు 10 టీఎంసీలు ఉండేలా చర్యలు తీసుకో వాలని కోరారు. దీనితో ఆయన ఎల్‌ఎండికి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసి నగరంలో తాగునీటి ఇబ్బందులు రాకుం డా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.
విలీన డివిజన్లలో ఇబ్బందులు
విలీన డివిజన్లు తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్, రేకుర్తితోపాటు కొత్తపల్లి చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావుల్లో నుంచి నీరు రావడం లేదు. అలాగే మిషన్ భగీరథ నీరు కూడా సరిగా రావడం లేదని, నీటి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే మాసంలో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందనే ఆందోళన చెందుతున్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నల్లా నీరు కూడా సరిపడా రావడం లేదని ఇబ్బంది పడాల్సి వస్తోందని పలుకాలనీల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎండల తీవ్రత అధికం కావడంతో రెక్కాడితే డొక్కాడని కార్మికులు, దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, చిరువ్యాపారులు గిరాకీలు పూర్తిగా తగ్గిపో యాయయని, ఈ వేసవి ఎలా గడిచేదంటూ ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పగటి ఉష్ణోగ్రతలు పెరుగడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రంజన్ల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం చల్లబడటమే కాకుండా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని వాతావరణశాఖ తీపికబురు చెప్పింది.