గతంలో జరిగిన అవినీతిపై సమన్లు కక్ష సాధింపే..
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:22 AM
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై తమ పాలకవర్గానికి సమన్లు ఇవ్వడం కక్ష సాధింపు చర్యనే అని, ప్రభుత్వం చేపట్టిన విచారణకు సహకరిస్తూనే న్యాయపోరాటం చేస్తా మని విచారణకు గడువును ఇవ్వాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కోరారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై తమ పాలకవర్గానికి సమన్లు ఇవ్వడం కక్ష సాధింపు చర్యనే అని, ప్రభుత్వం చేపట్టిన విచారణకు సహకరిస్తూనే న్యాయపోరాటం చేస్తా మని విచారణకు గడువును ఇవ్వాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కోరారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెస్ చైర్మన్ మాట్లాడుతూ సహకార చట్టం కింద సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)కు సంబంధించిన విచారణకు తమను హాజరుకావాలని సమన్లు జారీ చేశారని తెలిపారు. సహకార చట్టంలోని 51, 55సెక్షన్‌ల ప్రకారం విచారణకు సంబంధించి శుక్రవారం హాజరుకావాలని తమ పాలక వర్గానికి సమన్లు ఇచ్చారన్నారు. గతంలో సహకార శాఖ పంపిన సమన్లకు పాలకవర్గంలో ఒక్కొక్కరుగా విచారణకు హాజరైన తమ సమాధానాలను ఇచ్చామన్నారు. సంబంధిత రికార్డులన్నీ సహకార శాఖ వద్ద ఉన్నాయన్నారు. అవితీని అక్రమాలపై విచారణ అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ తమకు పంపిన సమన్లలో 11 అంశాలపై సమాధానాలు ఇవ్వడానికి పాలకవర్గానికి నెల రోజుల గడువు ఇవ్వాలని కోరామన్నారు. 2016 జరిగిన వ్యవహారానికి సంబంధించి ప్రస్తుత పాలక వర్గంతోపాటు అధికారులకు విచారణకు రావాలని సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జారీ చేసిన సమన్లల్లో 2014 నుంచి జరిగిన వ్యవహారాలపై విచారణ అని పేర్కొని, తాజాగా జారీచేసిన వాటిలో 2016 నుంచి అని పేర్కొ న్నారన్నారు. రెండేళ్ల కాలంలో ఉన్న పాలకవర్గానికి మాత్రం సమన్లు జారీ చేయలేదన్నారు. ఎవరిని తప్పించడానికి అప్పటి పాలక వర్గానికి ఇవ్వలేదనేది స్పష్టం చేయాలన్నారు. గతంలో జరిగిన అవినీతిపై తమ పాలకవర్గాన్ని విచారణ రావాలని కోరడం సరికాద న్నారు. తమపై లేని ఆరోపణలను ఆపాదించి ఏదో చేయాలని ప్రయ త్నిస్తున్నారన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, తమ పాలక వర్గానికి న్యాయం జరిగేవరకు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సమావేశంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్‌లు పాల్గొన్నారు.