Share News

బోగస్‌ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం

ABN , Publish Date - May 15 , 2026 | 01:04 AM

జిల్లాలో బోగస్‌ పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం అతేంటికేషన్‌(నిజనిర్ధారణ)కు శ్రీకారం చుడుతున్నది.

బోగస్‌ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో బోగస్‌ పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం అతేంటికేషన్‌(నిజనిర్ధారణ)కు శ్రీకారం చుడుతున్నది. ఈ మేరకు ఆసరా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి ఫేస్‌రికగ్నేషన్‌ గుర్తింపు యాప్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఫేస్‌రికగ్నిషన్‌ పనిచేయకపోతే వేలిముద్రల ద్వారా వారిని గుర్తించనున్నారు. తద్వారా అనర్హులైన పింఛన్‌దారులను, మృతిచెందిన వారి పింఛన్లను తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియను జిల్లాలో ఈనెల20వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీ లోపు పూర్తి చేయనున్నారు. ఈనెల18వ తేదీన జిల్లా కేంద్రంలో పంచాయతీ గ్రామ కార్యదర్శులకు, మున్సిపల్‌ సిబ్బందికి ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. వారియొక్క మొబైల్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌తో పాటు, వేలిముద్రలు తీసుకుని మంత్ర యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది. దీనిపై సిబ్బందికి కలెక్టరేట్‌లో ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు.

- జిల్లాలో 90,990మంది లబ్ధిదారులు

జిల్లాలో పింఛన్ల పథకం ద్వారా 90,990మంది లబ్ధి పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 38,292 మంది, వితంతువులు 31,901మంది, దివ్యాంగులు 12,557మంది, చేనేత కార్మికులు 770మంది, గీత కార్మికులు 2074మంది, బీడీ కార్మికులు 693మంది, ఒంటరి మహిళలు 2,561మంది, టేకేదారులు ఐదుగురు, ఏఆర్‌టి బాధితులు 1614మంది, ఫైలేరియా బాధితులు 338మంది, డయాలసిస్‌ బాధితులు 185మంది ఉన్నారు. ఇందులో దివ్యాంగులకు ప్రతినెల 3,016రూపాయలు, ఇతరులకు 2,016రూపాయల చొప్పున నెలకు 21కోట్ల 8లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. అయితే వీరిలో కొంతమంది బోగస్‌ లబ్ధిదారులు ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే మరణించిన పింఛన్‌దారుల పేర్లను జాబితాలోంచి తొలగించకపోవడంతో వారి పేరిట ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో డబ్బులు వృథాఅవుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకసారి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఫేస్‌ రికగ్నేషన్‌ చేపడితే వాళ్లు ఉన్నారా, లేరా అనే విషయం బయటపడుతుందని ప్రభుత్వం లైవ్‌నెస్‌ అతేంటికేషన్‌కు శ్రీకారం చుడుతున్నది. వాస్తవానికి కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులైన లబ్ధిదారులను, మరణించిన లబ్ధిదారులను గుర్తించి వారిపేర్లను తొలగించాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించినప్పటికీ అది పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. కేవలం కొందరు చనిపోయిన వారిపేర్లు మాత్రమే తొలగించారు. ఇంకా మరికొందరు చనిపోయిన కూడా వారిపేరిట పింఛన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. లైవ్‌నెస్‌ అతేంటికేషన్‌ చేపడితేనే బోగస్‌ లబ్ధిదారులు బయటపడతారని ప్రభుత్వం ఇందుకు చర్యలు చేపట్టింది. వచ్చేనెల 15వతేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో వెయ్యిమందికి పైగా బోగస్‌ లబ్ధిదారులు, మరణించిన వాళ్లు బయటపడే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించలేదని తెలుస్తున్నది.

- కొత్తగా పింఛన్లు మంజూరు అయ్యేనా?

గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చింది. ఆపార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న కూడా ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుపై ఊసెత్తకపోవడంతో అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే పాతపింఛన్‌ దారుల్లో దివ్యాంగులకు 6వేల రూపాయలు, ఇతరులకు 4వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా నెరవేరలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల సందర్భంగా జిల్లాలో అనేకమంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనీసం వాటిని ప్రభుత్వం పరిశీలించడం లేదు. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతున్నప్పటికీ, ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.బోగస్‌ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం

Updated Date - May 15 , 2026 | 01:04 AM