Share News

మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:07 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యం జిల్లాలో పక్కదారి పట్టింది.

మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం

సుల్తానాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యం జిల్లాలో పక్కదారి పట్టింది. ప్రభుత్వం ద్వారా వచ్చిన ధాన్యాన్ని మరపట్టి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లలో కొందరు ధాన్యాన్ని దారి మళ్ళించారు. పదేళ్ళలో రూ.200 కోట్లకు పైగా మిల్లర్లు బకాయి పడ్డారు. సోమవారం డబ్బులు చెల్లించకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పక్కదారి పట్టిన సీఎంఆర్‌ ధాన్యం వ్యవహారం ఇలా ఉంది.

ప్రతీ వ్యవసాయ సీజన్‌లో పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం అం దించిన ధాన్యంతో పలువురు మిల్లర్లు సొంత వ్యాపారాలకు తెరలేపారు. గడువులోగా ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి పంపించాల్సిన కొందరు మిల్లర్లు దర్జాగా వాటిని అమ్ముకున్నారు. అధికారులు ఆలస్యంగా స్పందించి తమకు రావాల్సిన సీఎంఆర్‌ బియ్యం కోసం ఒత్తిడి చేస్తే అసలు మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వలు లేకుండాపోయాయి. సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన విషయం తెలిసినా వీరిని బ్లాక్‌ లిస్టులో పెట్టి మరో సీజన్‌కు ధాన్యాన్ని అప్పగించవద్దు. కానీ అధికారులు సదరు డిఫాల్టర్‌ మిల్లుకు మళ్లీ ధాన్యాన్ని అలాట్‌ చేస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఫ సెంటర్ల నుంచే బహిరంగ మార్కెట్‌కు లారీలు

ప్రతీ వ్యవసాయ సీజన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఆయా మిల్లులకు అలాట్‌మెంట్‌ చేస్తారు. ఏ కేంద్రం నుంచి ఏ మిల్లుకు పంపించాలన్న విషయాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు కొన్ని మిల్లులకు చేరకుండానే వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి తరలించేవారు. ఇలా అనేక సందర్భాలలో లారీలు పట్టుబడ్డాయి. ప్రతీ సీజన్‌లో ఒక్కో మిల్లుకు 200 నుంచి 400 లారీల వరకు ధాన్యం అలాట్‌ చేస్తారు. వీటి విలువ ఐదు నుంచి పది కోట్ల వరకు ఉంటుంది. అయితే ముందుగానే వీటిని దుర్వినియోగం చేయాలనుకున్న మిల్లర్లు వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులను స్వంతానికి వాడుకుంటున్నారు. ఇలా ఓ సీజన్‌ ధాన్యం అమ్ముకుంటూ మరో సీజన్‌కు వచ్చిన ధాన్యంతో కొంత మేర ప్రభుత్వానికి బియ్యం అప్పగిస్తూ కాలయాపన చేస్తున్నారు. చివరకు పలు మిల్లులు డిఫాల్టర్లుగా తేలారు. ఇలాంటి పరిస్థితి 2014 నుంచి జిల్లాలో కొనసాగింది.

ఫ సొమ్ముల రికవరికి కలెక్టర్‌ చొరవ

జిల్లాలో 2023-24 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బియ్యం రికవరీ కోసం కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇటీవల అధికారు లతో సమావేశమై కఠినచర్యలు తీసుకోవాలని అదేశించారు. అయితే కొందరు మిల్లర్ల అభ్యర్థన మేరకు సోమవారం వరకు గడువు ఇచ్చారు.

ఫ 45 మిల్లుల నుంచి 200 కోట్లకు పైగా రావాల్సి ఉంది

ముప్పిడి శ్రీకాంత్‌ రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌

జిల్లాలో పది సంవత్సరాల నుంచి పలువురు మిల్లర్లు ప్రభుత్వం అందించిన ధాన్యాన్ని బియ్యంగా ఇవ్వలేదు. తనిఖీలలో ఆయా మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు లేవు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లపై కఠినచర్యలు తీసుకొంటాం. సోమవారంతో మిల్లర్లకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఈలోగా వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తే సరి లేదంటే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. 2014 నుంచి 2023-24 వరకు జిల్లాలో దాదాపు వందకు పైగా రైస్‌మిల్లుల నుంచి రూ.470 కోట్లకు పైగా రావాల్సి ఉంది. తమ చర్యల మూలంగా డిఫాల్టర్‌గా తేలిన మిల్లర్లు ఇప్పటి వరకు 58 శాతం అంటే దాదాపు రూ.256 కోట్లు చెల్లించారు. ఇంకా జిల్లాలోని 45 రైస్‌మిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్నారు. వారి నుంచి రూ.200 కోట్లకు పైగా రావాల్సి ఉంది. వారి నుంచి బియ్యం తీసుకునే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం ఎంత బియ్యం అప్పగించాలో అంతకు సమానంగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. లేనిచో కేసులు నమోదు చేస్తాం.

Updated Date - Mar 09 , 2026 | 01:07 AM