మోగిన నగారా
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:56 AM
మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. మూడురోజులపాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. మూడురోజులపాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించి 31న వాటిని పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలను ప్రకటించి, ఫిబ్రవరి 1న వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను 2న పరిశీలించి పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3న మద్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. 14లోపు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు. 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు బాధ్యతలను స్వీకరిస్తారు.
ఫ జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు
జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
- కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో 3,40,580 ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,69,679 మంది పురుషులు, 1,70,858 మంది మహిళలు, 43 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
- హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 29,531 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14,357 మంది పురుషులు, 15,170 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ఈ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది.
- జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఇది ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింద. ఈ మున్సిపాలిటీలో 34,455 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,815 మంది పురుషులు, 17,639 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.
- చొప్పదండి మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. 14 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 13,916 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,743 మంది పురుషులు, 7,173 మంది మహిళలు ఉన్నారు.
ఫ రాజకీయ కలకలం:
మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మూడో వారంలోగా పూర్తవుతాయని అందరూ ఊహించారు. అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ అందరినీ షాక్‌కు గురిచేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 28 ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్లను స్వీకరిస్తారని మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది. దీంతో పోటీలో ఉండాలనుకుంటున్న అభ్యర్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడానికి 24 గంటల వ్యవధి కూడా లేక పోవడం, ఓటరు లిస్టు కూడా వారి వద్ద లేక పోవడం, బ్యాంకు అకౌంట్, కుల ధ్రువీకరణ, పన్నుల బకాయిలేకుండా చూసుకోవడం లాంటి పనులు వెంటనే పూర్తి చేసుకోవలసి ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగనున్నది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆయా దినాల్లోనే నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నవారు వారికి మద్దతు ఇస్తున్న వారు నామినేషన్ల కోసం జాతరను వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఫ నేటి నుంచి కోడ్ అమలు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతోనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుంది. 50 వేల రూపాయలకు మించి తీసుకెళితే వాటికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల వివరాలు
----------------------------------------------------------
నగరం/పట్టణం మేయర్/చైర్మన్ రిజర్వేషన్ వార్డులు/డివిజన్లు ఓటర్లు
----------------------------------------------------------------------------------------------------------------
కరీంనగర్ బీసీ జనరల్ 66 3,40,580
హుజూరాబాద్ ఎస్సీ మహిళ 30 29,531
జమ్మికుంట ఎస్సీ జనరల్ 30 34,455
చొప్పదండి ఎస్సీ మహిళ 14 13,916