Share News

కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడమంటే ప్రజల సొమ్ము దుర్వినియోగమే..

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:42 PM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కుంగి పోవడమంటే లక్ష కోట్లు ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్లేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు.

కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడమంటే ప్రజల సొమ్ము దుర్వినియోగమే..

సిరిసిల్ల టౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు కుంగి పోవడమంటే లక్ష కోట్లు ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్లేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య ఇంటికి తేనీటి విందుకు మంత్రి వచ్చారు. పుష్పగుచ్ఛాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు స్వాగతం పలికారు. నాయకులు శాలువాతో మంత్రిని ఘనంగా సన్మానించారు. పార్టీ నాయకులు వివిధ సమస్యలపై వినతిపత్రాలను ఇవ్వగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి వివేక్‌వెంటకస్వామి మాట్లాడారు. కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై, రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకిరావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారన్నారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుందామంటే కేసీఆర్‌ మాత్రం పౌంహుజ్‌ నుండి బయటకు రాలేదని మనవడి పుట్టిన రోజుకు మాత్రం హైదరాబాద్‌కు వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ రావాలని, ప్రజల సమస్యలపై మాట్లాడాలని, పలు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరినా రెండున్నర సంవత్సరాలుగా కేసీఆర్‌ ఫాంహౌస్‌ వదలి బయటకురావడం లేదన్నారు. హరీష్‌రావు, కేటీఆర్‌ కాళేశ్వరం నుంచి ప్రతిరోజు లక్ష క్యూసెక్‌ల నీళ్లు పోతున్నాయని నీళ్లను పంపింగ్‌ చేయాంటూ డిజిటల్‌ ద్వారా ప్రజెంటేషన్‌ ఇచ్చారన్నారు. కాళేశ్వరం బ్యారేజీలు కుంగి పోవడం అంటే లక్షల కోట్లు ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం జరిగిందో ప్రజలకు అర్థం అయిందన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్‌, హారీష్‌రావు ప్రయత్నిస్తున్నారని అరోపించారు. కల్వకుంట్ల కవిత చాలా మంచి ప్రశ్నవేశారని అన్నారు. రూ.1400కోట్లు బీఆర్‌ఎస్‌ అకౌంట్లకు ఎక్కడ నుంచి వచ్చాయని కవిత ప్రశ్నించిందని దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు వేల ఇందిరమ్మ ఇళ్ళకు దాదాపు రెండు వేల ఇళ్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో వేయి ఇందరమ్మ ఇళ్లు నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. తమ శాఖలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను స్థాపించామని, జిల్లాలో టామ్‌కామ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి జర్మనీ లాంగ్వేజ్‌పై యువతకు శిక్షణ కల్పించి అక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వంద మందిని జర్మనీకి పంపించే కార్యక్రమాన్ని తీసుకుంటామన్నారు. అనంతరం మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు కూతురు వివాహానికి మంత్రి హాజరై వధువరులను ఆశీర్వదించారు. ఈ సమావేశంలో గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ వెలుముల స్వరూపతిరుపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, సెస్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, మున్సిపల్‌ ప్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ, కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:42 PM