Share News

ఆశావహుల మౌనం..

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:10 AM

బల్దియాలో అడుగు పెట్టాలని తహతహతో నిన్నమొన్నటి వరకు హడావుడి చేసిన ఆశావహులు ధన రాజకీయాల మధ్య మౌనం దాల్చారు.

ఆశావహుల మౌనం..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బల్దియాలో అడుగు పెట్టాలని తహతహతో నిన్నమొన్నటి వరకు హడావుడి చేసిన ఆశావహులు ధన రాజకీయాల మధ్య మౌనం దాల్చారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటూ వార్డుల్లో ప్రచారం చేసుకొని యువత, సామాజిక వర్గాల పెద్దలకు దావత్‌లు ఇస్తూ మద్దతు కూడగట్టుకున్న ఆశావహులు ఎన్నికల ఖర్చులు చూసి వెనుకడుగు వేస్తున్నారు. స్వతంత్రంగా బరిలో దిగడానికి సైతం ముందుకు వచ్చిన వారే కాకుండా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల మునిసిపల్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌లో మాత్రం బీ ఫాం లభిస్తే మాజీ మంత్రి కేటీఆర్‌ ఖర్చులు చూసుకుంటాడనే ధీమాతో అభ్యర్థులు హడావుడి చేసిన ఖర్చు విషయంలో భయంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీలో మాత్రం అభ్యర్థులను వెతికే పరిస్థితి కనిపిస్తోంది. వేములవాడలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసిపోతున్న అభ్యర్థులను నిలబెట్టడం, వారు జారిపోకుండా కాపాడుకోవడంలో ప్రధాన పార్టీలకు తలనొప్పిగానే మారింది. బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఖరారు పూర్తికావడంతో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌ వారికి మార్గనిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగానే కొనసాగుతోంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ తిరిగి పాలకపగ్గాలు చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అధికారంలో ఉండడంతో ఈసారి రెండు మున్సిపాలిటీల్లో తమ ఉనికి చాటుకునే దిశగా కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ అనూహ్యమైన మంచి ఫలితాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. ప్రధాన పార్టీలు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టినా ఆశావహులు వెనుకడుగు వేస్తుండడంతో సమస్యగా మారిందని ఆయా పార్టీల నేతలే చర్చించుకుంటున్నారు.

పదవి కావాలంటే రూ 50 లక్షల ఖర్చు..

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉన్నాయి. గతంలో వార్డు అభివృద్ధి, అభ్యర్థి గుణగణాలు చూసి గెలుపునకు జై కొట్టేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎక్కువ డబ్బులు పంచిన వారే గెలిచే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో డబ్బుల పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ముందుకు వచ్చింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో కనీసంగా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. పదవి వ్యామోహంలో ఉన్న కొందరు రూ.కోటి వరకు ఖర్చు చేయడానికి సిద్ధమైన వారు ఉన్నారు. ఇందుకోసం భూములు, ఇతర ఆస్తులు, ఆభరణాలను తాకట్టుపెట్టి డబ్బులను సమకూర్చుకుంటున్నారు. పార్టీ బీ ఫామ్‌ లభిస్తే పార్టీ ఫండ్‌ వస్తుందని పెట్టుకున్న ఆశలు అభ్యర్థుల్లో సన్నగిల్లుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రధాన పార్టీలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్సు చేస్తుందని ఎంతో ఆశగా ముందుకు వచ్చిన ఆశావహులు నిరాశతోనే వెనుకడుగు వేసినట్లుగా భావిస్తున్నారు.

ఆర్థిక స్తోమతే అర్హత..

మున్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ నేపథ్యం, పార్టీపై విశ్వసనీయత, విధేయతల కంటే అభ్యర్థుల ఆర్థిక స్తోమత అర్హతగా మారింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎన్నికల ఖర్చు ఏ మేరకు భరించగలరనే దానిపై ఆరాతీసి టికెట్లు ఖరారు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేని వారి టికెట్లను వేరే వారికి ఇచ్చే ఆలోచనలు కూడా పార్టీ నాయకులు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jan 30 , 2026 | 01:10 AM