శక్తి స్కీం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:00 AM
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధానం చేయడం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు.
సుభాష్‌నగర్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధానం చేయడం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యాప్రమాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి శక్తీ స్కీం విద్యార్థులకు వరం అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిం చారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్ర మాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజన, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్‌సాగర్, భోగేశ్వర్, జిల్లా కమిటి సభ్యులు సన్నీ, సందేశ్, రాకేష్, అభిషేక్, సాయి తదితరులు పాల్గొన్నారు.