Share News

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:21 AM

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల స్థలాలను ఖరారు చేసి వాటిని వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

- ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం

- 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా

- 3.67 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లకు ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల స్థలాలను ఖరారు చేసి వాటిని వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి 2,75,550 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు సగటున 24 నుంచి 25 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో విత్తన పంట విస్తీర్ణం 50 వేల ఎకరాల పైచిలుకు ఉంటుంది. విత్తనపంట ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తాయి.

ఫ జిల్లా వ్యాప్తంగా 318 కొనుగోలు కేంద్రాలు

రైతులు తమ సొంత అవసరానికి ధాన్యాన్ని ఉంచుకొని మిగతావాటిని అమ్ముతారు. విత్తనపంట, రైతుల అవసరాలకు మినహాయించుకొని ధాన్యం, ప్రైవేట్‌ వ్యాపారులు కొనే ధాన్యం పోను సుమారు 3,67,776 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకవస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోలుకు 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 182, ఐకేపీ ఆధ్వర్యంలో 91, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 37, హాకా ఆధ్వర్యంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల స్థలాలను ఇప్పటికే ఖరారు చేసి జిల్లా యంత్రాంగం ఆయా కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రం అంటూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తూకం మిషన్లను, టార్పాలిన్లను, తూర్పారపట్టే మిషన్లను, తేమను చూసే యంత్రాలను, సన్నదొడ్డు దాన్యాలను నిర్దారించే పరికరాలను, గోనె సంచులను సమకూర్చేందుకు సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో అందుబాటులో ఉన్న యంత్రాలు, పరికరాలు, గోనె సంచులు పోను ఇంకా ఎన్ని అవసరమవుతాయో గుర్తించి ఆర్డర్‌ చేశారు. మరో 15 రోజుల్లో కోతలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే ఎండలు ముదరడంతో వెంటవెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వస్తారని భావిస్తున్నారు.

ఫ సన్న ధాన్యం బోనస్‌ ఇస్తారా..?

రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం పండించే వారికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌గా చెల్లిస్తామని గతంలో ప్రకటించింది. గత వానా కాలంలో రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్‌ చెల్లించినా అంతకు ముందు యాసంగి సీజన తాలూకు బోనస్‌ రైతులకు అందలేదు. ఈ యాసంగి సీజనలో బోనస్‌ ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటి వరకైతే ప్రభుత్వం బోనస్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. యాసంగిలో ఎండల కారణంగా నీరు సరిగా అందక పోవడం, ధాన్యం అధిక వేడితో విరిగిపోవడం లాంటి సమస్యలుంటాయి. దిగుబడి కూడా తక్కువ వస్తుంది. అందుకే రైతులు పెద్దగా సన్నధాన్యం సాగు చేయలేదు. జిల్లాలో సుమారు 30 వేల నుంచి 35వేల ఎకరాల్లో మాత్రమే సన్న ధాన్యం సాగు చేశారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 02:25 AM