Share News

ఠారెత్తిస్తున్న ఎండలు..

ABN , Publish Date - May 22 , 2026 | 12:50 AM

ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. దంచి కొడుతున్న ఎండలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనాలు మాడిపోతున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. దంచి కొడుతున్న ఎండలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనాలు మాడిపోతున్నారు. వడదెబ్బలతో మృత్యువాత పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఎండలతో జిల్లా అగ్నిగుండంగా కనిపిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఉక్కపోత సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పొద్దున 10 గంటలకే జనాలు బయట కాలు పెట్టలేకపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి జనాలు రావడం లేదు. వడగాల్పులకు తలుపులు మూసుకొని ఇండ్లలోనే కూలర్లు. ఫ్యాన్లు. ఏసీల ముందు ఉసూరుమంటున్నారు. ఇళ్లలో ఉన్నా భరించలేనంత వేడి ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్‌, పెద్ద బజార్‌, చేనేత చౌక్‌, వెంకంపేట, గోపాల్‌ నగర్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. వివిధ ప్రాంతాలకు బస్సుల ద్వారా వెళ్లేవారు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు చేయడానికి సిద్ధపడడంతో మధ్యాహ్నం వేళల్లో బస్‌స్టేషన్లు జనసంచారం లేక నిర్మానుష్యంగానే కనిపిస్తున్నాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్లుగానే కనిపిస్తున్నాయి.

వామ్మో.. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు దాటితేనే వామ్మో అనేవారు. ఈసారి ఏకంగా గురువారం రికార్డు స్థాయిలో 46.4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెడ్‌ అలర్ట్‌గా కొన్ని ప్రాంతాలు, ఆరెంజ్‌ అలర్ట్‌గా మిగతా ప్రాంతాలు నిలుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రెడ్‌ జోన్‌లో వేములవాడరూరల్‌, ముస్తాబాద్‌, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడ, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండల్లాలు ఉన్నాయి. అరెంజ్‌ జోన్‌లో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, బోయిన్‌పల్లి మండలాలు ఉన్నాయి.

గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు..

మండలం గరిష్ఠ ఉష్ణోగ్రత

వేములవాడరూరల్‌ 46.4

ముస్తాబాద్‌ 46.3

రుద్రంగి 46.1

కోనరావుపేట 46.1

వేములవాడ 45.7

ఇల్లంతకుంట 45.7

సిరిసిల్ల 45.2

వీర్నపల్లి 44.9

ఎల్లారెడ్డిపేట 44.9

గంభీరావుపేట 44.8

తంగళ్లపల్లి 44.8

చందుర్తి 44.6

బోయిన్‌పల్లి 44.4

చిరు వ్యాపారాలకు ఎండ దెబ్బ

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోడ్డు పక్కన చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు జరుపుతూ ఉపాధి పొందుతున్న వారికి ఎండవేడికి జనాలు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సమ్మర్‌ సీజనల్‌ వ్యాపారంగా ఉండే జ్యూస్‌ సెంటర్లు, కొబ్బరి బోండాలు, ఐస్‌క్రీమ్‌ సెంటర్లకు ఎండ వేడితో జనాలు రాకపోవడంతో దుకాణాలు నవడంలేదని వాపోతున్నారు. సాధారణ ఎండలు ఉంటే జనం బయట రావడం అదే సమయంలో కాస్త ఊరట చెందడానికి చల్లని పానీయాల వైపు చూస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో ఎవరు రావడంలేదని సాయంత్రం వేళల్లోనే వ్యాపారాలు నడుస్తున్నాయని చెబుతున్నారు.

ఎండ తీవ్రతకు మృత్యువాత..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక జనాలు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. గడిచే నెల రోజుల్లోనే జిల్లాలో 8 మంది వడదెబ్బతో మృతిచెందారు. జిల్లాలో సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి చెందిన రాచర్ల రవి(55), వేములవాడ రూరల్‌ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన జంకె మల్లేశం(43), వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సామ తిరుపతి (60), వేములవాడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన హింగే రాజిరెడ్డి (56), కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన కోలకాని భూదవ్వ (60), గొల్లపల్లి గ్రామానికి చెందిన గోపు లచ్చయ్య (61), వట్టిమల్ల గ్రామానికి చెందిప కోరేపు లచ్చవ్వ (60), బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన నల్లాల మోహన్‌ (55) వడదెబ్బతో మృతిచెందారు. సరైన సౌకర్యాలు లేక పనులు చేస్తున్న ఉపాధి కూలీలు మృత్యువాత పడుతున్నారు. రోజువారి కూలీలు అనేకమంది అస్వస్థతకు గురవుతున్నారు.

ముందు జాగ్రత్తలు పాటించాలి

వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళుకల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలని, మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు తాగడం చేయాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపైన వెళ్లేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణం చేయకపోవడం మంచిదని, తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గొడుగు పట్టుకుని వెళ్లాలని చెబుతున్నారు. వడదెబ్బ తగిలితే ఓఆర్‌ఎస్‌ పొడిని సాగించాలని, అందుబాటులో లేకుంటే ఉప్పు లేదా చక్కెర కలుపుకొని తాగాలని, అపస్మారక స్థితిలోకి వెళ్తే నీరు తాగించకుండా వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - May 22 , 2026 | 12:50 AM