Share News

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:59 AM

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
జగిత్యాలలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క

-సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

- రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

జగిత్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సర్పంచ్‌లు దృష్టి సారించాలని ఆమె సూచించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్పంచ్‌ల శిక్షణ శిబిరాన్ని బుధవారం మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైనసర్పంచ్‌లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సర్పంచ్‌లు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మనం చేసే మంచి పనులు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. పంచాయతీలకు ఏ విధంగా నిధులు వస్తాయి.. పరిపాలన ఎలా చేయాలి.. పంచాయతీరాజ్‌ చట్టం ఎలా ఉంది.. సర్పంచ్‌లు ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏ పనికి ఏ నిధులు ఉపయోగించాలి, ఏ విధంగా నిధులు సేకరించాలనే అంశాలపై శిక్షణలో వివరిస్తున్నామన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా నిధులు రాలేదని, పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. పంచాయతీల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సర్పంచ్‌లకు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సర్పంచ్‌లు సుపరిపాలన అందించి గ్రామాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు. సమావేశంలో ఎస్పీ అశోక్‌ కుమార్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మదన్‌ మోహన్‌, డీఆర్‌డీవో రఘువరన్‌, రేవంత్‌, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్‌ బోనగిరి నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫఆంజనేయస్వామి చిత్రపటం బహూకరణ..

జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి సీతక్కకు బుధవారం డీఆర్‌డీఓ ఉద్యోగులు, పలువురు ఐకేపీ మహిళలు అందించారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన సందర్భంగా మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క ఇచ్చారు. జగిత్యాలకు వచ్చిన మంత్రి సీతక్కకు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పలువురు వినతిపత్రాలను సమర్పించారు.

Updated Date - Jan 22 , 2026 | 12:59 AM