అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్రకీలకం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:13 AM
నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
కరీంనగర్ టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పలు అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంత అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రతిరోజు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
ఫ పౌరసేవలకు ప్రాధాన్యమివ్వాలి..
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పౌరసేవలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. డివిజన్లలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని, వేసవిలో తాగునీరు వృఽతా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి కార్పొరేటర్ డివిజన్లలో పర్యటించి సమస్యలను గుర్తించాలన్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ఈసారి 46 మంది తొలిసారి ఎన్నికయ్యారని, వారికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు మున్సిపల్ చట్టాలు, వ్యవస్థ, విభాగాలు వాటి పనితీరుపై అవగాహన చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో రమేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రొటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్‌కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ మహ్మద్, చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్‌పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్లు ముసాబ్ అహ్మద్, మనోహర్, మహ్మద్ అయాజ్ పాల్గొన్నారు.