Share News

దీప ప్రభలు... ధనలక్ష్మీ పూజలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:21 AM

దీపాల కాంతులు... టపాసుల మోతలు... ధనలక్ష్మీ పూజలతో జిల్లావ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

 దీప ప్రభలు... ధనలక్ష్మీ పూజలు

కరీంనగర్‌ కల్చరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : దీపాల కాంతులు... టపాసుల మోతలు... ధనలక్ష్మీ పూజలతో జిల్లావ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మధ్యాహ్న సమయానికి చతుర్దశి ఉండడంతో ఉదయాత్పూర్వం నుంచి మంగళహారతులు, మధ్యాహ్నం అమావాస్య రావడంతో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దీపావళి ధనలక్ష్మీ పూజలు, కేదారీశ్వర, సత్యనారాయణస్వామి వ్రతాలు జరుపుకున్నారు. కొందరు సోమవారం కేదారీశ్వర, సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ఇంటిల్లిపాది బాణసంచా కాలుస్తూ ఆనందించారు. కేంద్ర హాం శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మహాశక్తి ఆలయం, పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో జరిగిన కేదారీశ్వర వ్రతంలో ఆయన తల్లి, సోదరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వెలుగులు ప్రతీ ఇంటా ఆనందాన్ని సంతోషాన్ని సిరి సంపదలను నింపాలని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్‌, బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌రావ భగత్‌నగర్‌లోని తన నివాసంలో సతీమణి అపర్ణ, డివిజన్‌, నగర వాసులతో కలసి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఫ సమాధుల్లో ఘనంగా సంబరాలు...

బీట్‌ మార్కెట్‌ ఇరుపక్కల, సవరన్‌ స్ట్రీట్‌, ఆదర్శనగర్‌ ప్రాంతాల్లో సమాధుల్లోని గతించిన పెద్దలకు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తమ పుట్టుకలకు పూర్వం నుంచి సమాధుల్లో గతించిన వారి స్మృతిలో గడపడం జరుగుతుందని, ఆధ్యాత్మికత, వైరాగ్యం, పెద్దలపై గౌరవ భావన ఈ వేడుకల్లో ఉన్నాయని అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

ఫ మహాశక్తి ఆలయంలో.....

చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు విశేషాలంకరణ, మహాహారతి, లక్ష్మీకుబేర హోమం నిర్వహించారు. పసుపు, కుంకుమలు, గాజులు వితరణ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజయ్‌తో పాటు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, భక్తులు పాల్గొన్నారు. రాత్రి సీఆర్‌పిఎఫ్‌ భద్రతా సిబ్బందితో కలసి సంజయ్‌ టపాసులు కాలుస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:21 AM