గుప్పుమంటున్న గుడుంబా
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:51 AM
పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది.
పెద్దపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది. కొన్ని ప్రాంతాల్లో గుడుంబా తయారీ, నిల్వ, సరఫరా యథేచ్ఛగా సాగుతుంది. మరోవైపు పండుగల వేళ మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గ్రామాలలోని బెల్ట్‌షాపుల ద్వారా మద్యం అందుబాటులో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీనాలీ చేసుకునే కార్మికులు, యువతలో కొందరు మద్యానికి బానిసలవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ పోషణకు ఉపయోగపడాల్సిన కూలీ డబ్బులు మద్యానికి ఖర్చవుతుండటంతో పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఫ జిల్లా వ్యాప్తంగా విస్తరణ
జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై సమగ్ర నిఘా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో గుడుంబా తయారీ జరుగుతోందని, ఇతర ప్రాంతాల నుంచి బెల్ట్‌షాపులకు అక్రమ మద్యం సరఫరా అవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు, నిర్మా నుష్య ప్రదేశాలు, వాగుల పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొన్ని గ్రామాలలో యధేచ్చగా తయారు చేస్తున్నారు.
ఫ వరుస దాడులు... వేల లీటర్ల పానకం ధ్వంసం
జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో వేల లీటర్ల పానకం పట్టుబడుతోంది. గత నెల 3న మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి సుమారు 2000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈనెల 8న మంథని పట్టణంలోని బోయిన్‌పేట, బొక్కల వాగు అటవీ ప్రాంతంలో సుమారు 1200 లీటర్ల బెల్లం పానకంతోపాటు 20 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో కూడా ఎక్సైజ్ అదికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో మండలాల వారీగా నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసు శాఖ సహకారంతో పండుగల సమయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
ఫ బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు
గ్రామాల్లోని కొన్ని దుకాణాలు, నివాస ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపులు మినీ బార్లను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాత్రి వేళల్లోనూ మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. సంబందిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధిక ధరలకు అమ్ముతున్నారా? మైనర్లకు మద్యం అందిస్తున్నారా? అనే అంశాల ఎవరూ పట్టించుకోవడం లేదు. బెల్ట్‌షాపుల వ్యవహారంలో కేవలం విక్రయించే వ్యక్తులపైనే కాకుండా, అక్రమ సరఫరాకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. సంపాదనలో అధిక భాగం మద్యానికి ఖర్చు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, పిల్లల పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, ఇంటి అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మద్యానికి అలవాటుపడిన కొందరు పనులకు సక్రమంగా వెళ్లకపోవడం, కుటుంబ బాధ్యతలను విస్మరించడం వల్ల ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడే కుటుంబాలు, ఇంట్లో తరచూ గొడవలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఫ ఆరోగ్యంపై ప్రభావం
గుడుంబా, మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. తయారీలో ఉపయోగించే పదార్థాలు, వాటి నాణ్యత, మలినాలు వంటి అంశాలపై నియంత్రణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ, విషపూరిత మద్యం సేవించడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. పండుగలు, జాతరల సందర్భంగా మద్యం వినియోగం పెరిగే అవకాశమున్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.