పల్స్ పోలియోను పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:59 PM
పల్స్ పోలియోతో పాటు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాలను పకడ్బందీ గా చేపట్టాలని అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : పల్స్ పోలియోతో పాటు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాలను పకడ్బందీ గా చేపట్టాలని అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం పల్స్ పోలియో, నులిపురుగుల మాత్రలు, సీజ నల్ వ్యాధుల సన్నద్ధతమై వైద్య ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖ అధి కారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్స్ పోలియోకు సంబంధించిన పోస్టర్‌లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో జీరో నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 41,147 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 393 వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 38 సూపర్ వైజర్లను నియమించామని వెల్లడించారు. 15 మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోలు, మెడికల్ అధికారులతో కలిసి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసి తమ పరిధిలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వాక్సిన్ వేయించాలని, ఈ విషయమై అన్నివిద్యాలయాల్లో ప్రార్థన సమయంలో, నోటీసు బోర్డులో రాయించాలని, మహిళా సంఘాల సమావేశాల్లో దీనిపై చర్చించాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఐదేళ్లలోపు పిల్లలం దరికీ పల్స్ పోలియో వాక్సిన్ అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లా లోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయా ల పరిధిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పిల్లలకు వాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్నవారికి నులి పురుగుల నివారణ మాత్ర లు పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం లక్షా 33వేల 695 మందికి జూలై 13వ తేదీన వేస్తారని, అదేనెల 20వ తేదీ వరకు ఏడాది నుంచి 19 ఏళ్ల వారికి అందేలా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించాల ని ఆదేశించారు. డెంగీ వ్యాప్తిచేసే దోమలు నిలువ ఉన్న మంచి నీటిలో పెరుగుతాయని తెలిపారు. వానాకాలం నేపథ్యంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అన్ని ఇళ్లలో పాత టైర్లు, కూలర్లు, ఇతర పాత్రలు, ఇంట్లో, ఇంటి ఆవరణలో నీరు నిలువ ఉండకుండా చూడాలని సూచించారు. నిలువ నీటిని తొలగించాలని తెలిపారు. ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థా యిలో వినియోగించాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి ఏంజేలా ఆల్ర్ఫెడ్, జిల్లా విద్యా ధికారి జగన్‌మోహన్‌రెడ్డి,జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, వైద్యులు, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.