Share News

తాలు.. తఖరారు

ABN , Publish Date - May 12 , 2026 | 01:10 AM

ఒక వైపు మండుటెండలు. మరోవైపు గాలిదుమారంతో ఎప్పుడు కురుస్తాయో తెలియని అకాలవర్షాలు, ఇంకొకవైపు కొనుగోళ్లు లేక కొన్నా మిల్లులకు తరలించక కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పడి ఉన్న దాన్యం.. వర్షం కురిస్తే ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

 తాలు.. తఖరారు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఒక వైపు మండుటెండలు. మరోవైపు గాలిదుమారంతో ఎప్పుడు కురుస్తాయో తెలియని అకాలవర్షాలు, ఇంకొకవైపు కొనుగోళ్లు లేక కొన్నా మిల్లులకు తరలించక కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పడి ఉన్న దాన్యం.. వర్షం కురిస్తే ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు తాలు, తరుగు పేరిట 40 కిలోల ధాన్యం బస్తాకు 42 కిలోలు తూకం వేస్తే తీసుకున్న రైసుమిల్లర్లు ధాన్యం శుభ్రంగా ఉండడం లేదని తాలు తప్ప ఎక్కువగా ఉంటుందనే కారణంతో 43 కిలోలు తూకం వేస్తేనే తీసుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయి. అధికారుల లెక్కల ప్రకారమే కొనుగోలు చేసిన 3,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రైతులు అమ్మకానికి తెచ్చి ఆరబోసిన ధాన్యం తూకం వేయని ధాన్యం కుప్పలుగా ఉన్నది.

- కటింగ్‌ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతి

అధికార కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్‌ వద్దకు వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో ధాన్యం కొనుగోలుపై వినతిపత్రం సమర్పించారు. 43 కేజీల తూకం వేస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని, అలాంటి పరిస్థితి కొనసాగితే 40 కిలోల తూకానికి అంగీకరించక పోతే తానే స్వయంగా రైతులతో కలిసి ధర్నా చేస్తామని కలెక్టర్‌కు తేల్చిచెప్పారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడడంతోపాటు తాలుపేరిట కటింగ్‌ లేకుండా ధాన్యాన్నికొనుగోలు చేయించాలని, రైతులకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరడం జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితికి అద్దంపడుతున్నది.

- సజావుగా సాగని కొనుగోళ్లు

ఈ యాసంగిలో 3.67 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తారని అంచనా వేశారు. తాలు, తరుగు పేరిట ఒక అవగాహన కుదరని కారణంగా కొన్ని రోజులు, ధాన్యం తేమ ఉండడంతో మరికొన్ని రోజులు కొనుగోళ్లు సజావుగా సాగలేదు. ఆ తర్వాత 42 కేజీలు ఇవ్వడానికి రైతులు అంగీకరించడంతో కొద్దిరోజులు కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఇప్పుడు తరుగు పేరిట మూడు కిలోలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్‌ చేస్తుండడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు జిల్లాలో 88,594 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలుచేశారు. అధికారుల అంచనా ప్రకారం మరో 2,80,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇంకా రైతుల వద్ద నుంచి కొనాల్సి ఉన్నది. అనధికారిక అంచనాల మేరకు ఇప్పటికే ఖరీదు చేసినఽ దాన్యం పోను 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈ ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనకపోతే అకాల వర్షాలతో నష్టపోవడమేకాకుండా రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- రైతుల ఖాతాల్లో జమ చేసింది రూ. 117.15కోట్లే

ఇప్పటి వరకు 12,638 మంది రైతుల నుండి 88,594 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటి విలువ 210.52 కోట్లు కాగా ఇప్పటి వరకు 7,012 మంది రైతుల ఖాతాల్లో 117.15 కోట్ల రూపాయలు మాత్రమే సివిల్‌ సప్లయిస్‌ శాఖ జమ చేసింది. మరో 5,626 మంది రైతులకు 93.37 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అప్‌లోడ్‌ చేయడం, ట్రక్‌ చిట్‌ జనరేట్‌ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇందుకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు రాకపోవడం ఒక కారణం కాగా మూడు కిలోల తరుగు ఇవ్వక పోవడంతో రైసు మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేక పోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. 12,638 మంది రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ఇప్పటి వరకు 9,608 మంది రైతులకు చెందిన 67,238 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగలిగారు. అప్‌లోడ్‌ చేసిన ధాన్యానికి కూడా వెంటనే ట్రక్‌ చిట్‌ జనరేట్‌ కావడం లేదు. 8,066 మంది రైతులకు సంబంధించిన ధాన్యానికి ట్రక్‌ చిట్‌ జనరేట్‌ చేసి మిల్లులకు పంపించగా 7,176 మంది రైతులకు సంబంధించిన 50,147 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లో దింపుకున్నట్లు మిల్లర్లు ధ్రువీకరించారు. మిగతా ధాన్యం ఇంకా మిల్లర్లు తీసుకోవలసి ఉన్నది. కొనుగోలు చేసిన ధాన్యం పరిస్థితే ఇలా ఉంటే కొనుగోలు చేయాల్సిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌ ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2026 | 01:10 AM