Share News

మున్సిపోల్స్‌లో గులాబీ జెండా ఎగురవేస్తా

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:52 PM

జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపోల్స్‌లో గులాబీ జెండా ఎగురవేస్తా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన రెండేళ్ళలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. 19న కరీంనగర్‌లో నిర్వహించనున్న సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులు, పోటీచేసి ఓడిపోయిన సర్పంచులకు సన్మానం నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఒక్క రూపాయి అభివృద్ధికి ఇవ్వక పోగా తాము మంజూరు చేసిన పనులను కూడా రద్దు చేసిందని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కలెక్టర్‌ ఆమోదంతో ఆర్డీవో స్వయంగా మంజూరు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. తమ హయాంలో మంజూరు చేసిన పనులను నిలిపివేశారని, ఎందుకు ఆపారో చెప్పి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే మంచి ఫలితాలు సాధించామని, హుజూరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో గెలిచామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, అదే జోష్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో కొనసాగించి గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు బండ శ్రీనివాస్‌, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:52 PM