Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:18 AM

మహిళలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహిళలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట గులాబీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు పడుతున్న అవస్థలను ఎండగడుతూ వారికి అండగా నిలిచేందుకు నగర శాఖ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని అబద్ధపు హామీలిచ్చి మోసగించిందని విమర్శించారు. ఆడబిడ్డలకు ప్రతినెలా రూ. 2వేలు ఇస్తామని, చదువుకునే విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందజేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. వీటన్నింటిపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మిగతా హామీలను విస్మరించారని అన్నారు. ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. వీటన్నింటిపై బీఆర్‌ఎస్‌ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు , నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌ కుమార్‌ గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:18 AM