వనదేవతలకు నీరా‘జనం’
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:41 AM
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకోవడంతో శుక్రవారం భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇంటిల్లిపాది ఉదయం నుంచే జాతర ప్రాంగణాలకు చేరుకున్నారు.
- సమ్మక్క జాతరకు పోటెత్తిన భక్తులు
- గోదావరిఖని, నీరుకుల్ల, కొలనూరు, గోలివాడ జాతరలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
- చల్లంగా చూడాలని ఆ తల్లులకు మొక్కులు సమర్పించిన భక్తులు
- నేడు సాయంత్రం ఆ తల్లుల వన ప్రవేశంతో ముగియనున్న జాతర
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకోవడంతో శుక్రవారం భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇంటిల్లిపాది ఉదయం నుంచే జాతర ప్రాంగణాలకు చేరుకున్నారు. ఒక రోజే సుమారు ఆయా జాతర్లకు 12 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంగణాలు ఊగిపోయాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క, సారలమ్మ తల్లులను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిలువెత్తు బంగారం ఇవ్వడంతో పాటు, కొందరు తల నీలాలు ఇవ్వగా. పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీశారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరను అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సందర్శించి బెల్లం, కొబ్బరి కాయలు, ఓడి బియ్యంతో మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి ఒడ్డున గల అంతర్గం మండలం గోలివాడ, గోదావరిఖని గంగ బ్రిడ్జి వద్ద, ఓదెల మండలం కొలనూరు, మానేరు తీరం వెంబడి గల సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గర్రెపల్లి, నారాయణపూర్, ముత్తారం మండలం మైదంబండ, పాలకుర్తి మండలం ఈసాలతక్కల్లపల్లి, వేమునూరు, రానాపూర్, ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికనపల్లి, దొంగతుర్తి, హనుమంతునిపేట, తుర్కలమద్దికుంట, పెద్దకలువల, తదితర ప్రాంతంలో జరుగుతున్న జాతరకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. సమీపంలో గల వాగులో భక్తులు స్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఇంటిల్లిపాది చల్లంగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కలు సమర్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్, అధికారులు, తదితరులు జాతర్లను సందర్శించి సమ్మక్క సారలమ్మ లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
కోల్‌సిటీ/కోల్‌సిటీటౌన్/కళ్యాణ్‌నగర్ జనవరి 30(ఆంధ్రజ్యోతి):
మరో మినీమేడారం గోదావరిఖని గోదావరి తీరం భక్తజనసందోహమైంది... వనదేవతలిద్దరు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల కోలాహలాలు... ఎదురుకోళ్ళు..., నిలువెత్తు బంగారం(బెల్లం)లను సమర్పించుకొని సల్లంగ చూడమ్మా అంటూ సమ్మక్క-సారలమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
గోదావరిఖని గోదావరి తీరం వద్ద సమ్మక్క సారలమ్మ జాతర జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి సమ్మక్కతల్లి గద్దెపై కొలువుదీరంతో రాత్రంతా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జాతరలో నాలుగువైపులా రహదారుల ఏర్పాటు, విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో భక్తులకు అసౌకర్యాలు కలుగలేదు. గద్దెల ప్రాంగణంలో ఇబ్బంది కలగకుండా రద్దీని క్రమబద్దీకరించారు. క్యూలైన్ల వద్ద భారీ షెడ్లు వేయడంతో భ క్తులకు ఎండతాకిడి తప్పింది. ఈసారి జాతరలో 7లక్షలకు పైగా జనం హాజరైనట్టు అంచనా వేస్తున్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉండటం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉండటంతో పెద్దపల్లి, మంచిర్యాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా చెన్నూరు, శ్రీరాంపూర్, మందమర్రి ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చారు. జాతరలో అసౌకర్యం కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఎన్‌పీడీసీఎల్, సింగరేణి, దేవాదాయశాఖలు సమన్వయంతో పనిచేశాయి. శుక్రవారం అదనపు కలెక్టర్ అరుణశ్రీ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు అప్పగించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దంపతులు అమ్మవార్ల దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ జాతర ప్రాంగణమంతా కలియతిరుగుతూ లోటుపాట్ల గురించి అధికారులకు సూచన చేశారు. శనివారం అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. రాజీవ్‌రహదారి గోదావరి వంతెన వద్ద ఈ జాతర జరుగుతుండటంతో రద్దీగా మారింది. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.
సుల్తానాబాద్, జనవరి 30 (ఆంద్రజ్యోతి): సమ్మక్క సారలమ్మల జాతరలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. నీరుకుళ్ళ, గర్రెపల్లి, తొగర్రాయి, నారాయణపూర్ గ్రామాలలో జరుగుతున్న సమ్మక్క జాతరలకు ప్రజలు పోటెత్తారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నీరుకుళ్లలో భారీగా భక్తులు చేరుకున్నారు. సమీపంలోని మానేరు వాగులో స్నానాలు ఆచరించి, అమ్మ వార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నారాయణపూర్‌లో ఎస్సారెస్సీ కాలువ ఉండడంతో స్నానాలుకు భక్తులు ఇబ్బందులు పడలేదు. తొగర్రాయిలో జాతరను ఆనుకుని మానేరు ఉండడం, దానికి తోడు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. జాతరకు పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో పోలీసులు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. జాతర ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.