Share News

పూలతేరుగా మూలవాగు..

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:52 AM

రాజన్న క్షేత్రం పువ్వులతో పులకించగా.. మూలవాగు తీరం మురువంగా.. గంగాధరుడి సాక్షిగా గౌరమ్మ ఆడబిడ్డల కేరింతల నడుమ గంగమ్మ చెంతకు చేరింది.

పూలతేరుగా మూలవాగు..

వేములవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాజన్న క్షేత్రం పువ్వులతో పులకించగా.. మూలవాగు తీరం మురువంగా.. గంగాధరుడి సాక్షిగా గౌరమ్మ ఆడబిడ్డల కేరింతల నడుమ గంగమ్మ చెంతకు చేరింది. వేములవాడలో శుక్రవారం సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. తంగేడు పూల తళుకులతో.. గునుగు పూల మెరుపులతో.. గౌరమ్మను పేర్చి.. వేలాదిగా కదిలోచ్చిన ఆడబిడ్డలతో మూలవాగు తీరమంతా పూల జాతరై సాక్షాత్కరించే.. అన్నట్లు ఏడొద్దుల సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా పట్టణానికి చెందిన మహిళలు తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చుకుని పట్టణ వీధుల్లో ఒక్కచోటు ఏర్పాటు చేసి వాటి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాల్లో మునిగితేలారు. మహిళలు బతుకమ్మ నిమజ్జనం కోసం విద్యుత్‌ దీపాలతో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన మూలవాగు ఘాట్‌ వద్దకు రావడంతో ఆ ప్రాంతం పూల జాతరను తలపింది. బతుకమ్మ ఘాటు వద్దకు బతుకమ్మలతో నిమజ్జనానికి వచ్చే మహిళలకు మున్సిపల్‌ సిబ్బంది పూలను చల్లుతూ స్వాగతం పలికారు. మూలవాగులో ఏర్పాటు చేసిన శివుని భారీ విగ్రహం ముందు మహిళలు బతుకమ్మలను ఆడారు. బతుకమ్మ తెప్ప సమీపంలో డీజే సౌండ్స్‌ వద్ద మహిళలు బతుకమ్మ వేడుకలను కన్నులపండువగా జరుపుకున్నారు. మహిళలు ఆడిన కోలాటం, దండియా ఆటలు ఆకట్టుకున్నాయి. సాయినగర్‌లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సతీమణి, మాజీ జడ్పీటీసీ ఆది వనజ, బద్దిపోచమ్మ వీధిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ సతీమణి, కౌన్సిలర్‌ ప్రతాప హిమబిందు స్థానిక మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌లో, మూలవాగులోని నీటిలో బతుకమ్మలు నిమజ్జనం చేశారు. గంగమ్మ ఒడిలోకి గౌరమ్మ చేర్చిన మహిళలు వీడ్కోలు పలుకుతూ.. పసుపు రాసుకుంటూ.. వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. వెంట తీసుకువెళ్లిన సద్దులను ఒకరికి ఒకరు పంచిపెట్టుకుని ఆరగించి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

భీమన్న ఆలయంలో ఆకట్టుకున్న బతుకమ్మ వేడుకలు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బతుకమ్మ వేడుకలు ఏడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజన్న ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో భీమన్న ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణానికి చెందిన మహిళలు బతుకమ్మలతో ఆలయానికి తరలివచ్చారు. బతుకమ్మల వద్ద కోలాటం, దండియా ఆటలు ఆకట్టుకున్నాయి. అనంతరం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కుండీలో బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. భీమన్న ఆలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు, పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వేడుకకు హాజరైన ప్రముఖులు..

వేములవాడ పట్టణంలోని ఏడు రోజుల సద్దుల బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మూలవాగు తీరం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ వద్దకు వచ్చిన ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే కలిసి బెలూన్‌ ఎగరవేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ వద్దకు వచ్చి సంబరాల్లో భాగమయ్యారు. పట్టణంలోని పలు వీధుల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలను కలిసి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన వేడుకల్లో గౌరిమాత ప్రత్యేక పూజలో పాల్గొని బతుకమ్మను నిమజ్జనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో సినీ నటులు సాయికుమార్‌, రామ్‌జగన్‌లు మూలవాగులోని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ప్రజాగాయకురాలు, బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్‌ విమలక్క, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మదేవందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, సిరిసిల్ల జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి తదితరులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేములవాడ పట్టణంలోని వాడవాడల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో మూలవాగు తీరానికి తరలిరానున్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ మహేష్‌ బి గితే నేతృత్వంలో డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్‌ సీఐ వీరప్రసాద్‌లు ఏర్పాట్లు చేశారు. మూలవాగు తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలేత్తకుండా పోలీస్‌ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Updated Date - Oct 17 , 2026 | 12:52 AM