ముంచుకొస్తున్న రుతుపవనాలు
ABN , Publish Date - May 23 , 2026 | 01:15 AM
నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకి పది రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటే, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరుగాలం కష్టించి పండించిన వరి, మొక్కజొన్న కళ్లాల్లోనో లేకుంటే కొనుగోలు కేంద్రాల్లోనో ఉండడంతో అకాల వర్షాలు కురిస్తే చేతికి రాకుండా పోయే ప్రమాదముందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాలు, తరుగు పేరిట బస్తాకు నాలుగు కిలోల చొప్పున క్వింటాలుకు 8 నుంచి 10 కిలోలు అదనంగా జోకితేనే కొనుగోలుకు ముందుకు వస్తున్న తరుణంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
- ముందుకుసాగని ధాన్యం కొనుగోళ్లు
- ఆందోళనలో రైతులు, ధర్నాలు చేస్తున్న రాజకీయ పక్షాలు
- మక్కల దిగుబడి అంచనా 7.60 లక్షల క్వింటాళ్లు
- 1.84 లక్షల క్వింటాళ్లు ఖరీదు
- 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం
- 2.17 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీదు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకి పది రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటే, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరుగాలం కష్టించి పండించిన వరి, మొక్కజొన్న కళ్లాల్లోనో లేకుంటే కొనుగోలు కేంద్రాల్లోనో ఉండడంతో అకాల వర్షాలు కురిస్తే చేతికి రాకుండా పోయే ప్రమాదముందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాలు, తరుగు పేరిట బస్తాకు నాలుగు కిలోల చొప్పున క్వింటాలుకు 8 నుంచి 10 కిలోలు అదనంగా జోకితేనే కొనుగోలుకు ముందుకు వస్తున్న తరుణంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. వారికి అండదండగా విపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు ప్రతి రోజు ఏదో ఒక చోట జిల్లాలో ఆందోళనలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. జిల్లాలో ఈ రబీలో 2.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. విత్తన పంట రైతుల అవసరాల కోసం మినహాయించుకునే ధాన్యం పోను 3.67 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 317 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఒక వైపు 54 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే మూసేశారు. అయినా ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 31,124 మంది రైతులకు చెందిన 2,17,739 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారుల అంచనా మేరకు ఇంకా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది. అయితే అనధికార లెక్కల ప్రకారం ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 516 కోట్ల 81 లక్షలు కాగా ఇప్పటి వరకు 384 కోట్ల 95 లక్షల రూపాయలు రైతులకు చెల్లించారు. ఇంకా 131 కోట్ల 86 లక్షల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. అటు కొనుగోలులో జాప్యం దానికి తోడు కొనుగోలు చేసిన ధాన్యం వారం పది రోజులు కేంద్రాలలోనే ఉండడంతో ఇప్పటికీ అమ్ముడు కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు రైతులకు అవకాశం దొరకడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఽసన్న రకం ధాన్యానికి క్వింటాలుకు ఐదు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కొనుగోలు చేసిన ధాన్యంలో 4,966 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉన్నది. దీనికి 2.48 కోట్ల రూపాయలు రైతులకు బోనస్‌గా చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
ఫ మొక్కజొన్న రైతులది మరో కష్టం
వరి ధాన్యం కొనుగోలులో తాలు పేరిట తరుగు తీస్తూ కొనుగోలులో జాప్యం చేస్తుండడం రైతన్నలకు నష్టం కలిగి స్తుండగా, మొక్కజొన్న పండించిన రైతులకు అసలు మద్ధతు ధర లభించక ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు 2400 రూపాయలు మద్ధతు ధర ప్రకటించగా వ్యాపారులు 1600 నుంచి 1800 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నా గత సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యమే గోడౌన్‌లలో మూలుగుతుండడంతో కొత్తగా కొనుగోలు చేసే మక్కలకు స్థలం లేకపోవడం తదితర కారణాలతో అంతగా ఆసక్తి చూపక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. దీనితో రైతులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ ఒత్తిడితో మార్క్‌ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నామ్‌కే వాస్తేగా జిల్లా వ్యాప్తంగా కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ సారి 30,242 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల పైన దిగుబడి వచ్చిందని రైతులు చెబుతుండగా అధికారులు మాత్రం 24 క్వింటాళ్ల చొప్పున దిగుబడి అంచనా వేశారు. అధికారుల అంచనా మేరకు చూసినా 7.60 లక్షల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు కేవలం 1,84,172 క్వింటాళ్ల మొక్కజొన్నలను మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరగుతుండడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు మద్ధతు రాకున్నా 1600 నుంచి 1800 రూపాయలకు క్వింటాల్ చొప్పున అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్ధతు ధర ఇప్పించి జిల్లాలో పండించిన మొత్తం మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వర్షాలు రాక ముందే వరి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.