Share News

తెలంగాణలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసింది..

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:21 AM

రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసిందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసింది..

రుద్రంగి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసిందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.2.50కోట్లతో ఎకరం 10 గుంటల స్థలంలో ఆధునిక హంగులతో నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి డీజీపీ బీ శివధర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితేతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ బీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మావోయిజం అంతమైందని స్పష్టం చేశారు. 1995-96 సంవత్సరంలో కరీంనగర్‌లో ట్రైనింగ్‌లో ఉన్న సమయంలో ఈప్రాంతంలో తిరిగానన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలో జనశక్తి నక్సలైట్లు ఉండేవారని, మానాల ప్రాంతంలో మావోయిస్టులు ఉండేవారన్నారు. రుద్రంగి ప్రాంతంలో పోలీసులు కూడా కష్టంగా తిరిగే పరిస్థతి ఉండేదని గుర్తుచేశారు. 2004 తరువాత చాలా వరకు మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసింగ్‌లో నూతన మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజల కేంద్రంగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామని, అదే స్థాయిలో విస్తృత సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం.. తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. హత్యలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ద్విచక్ర వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. పౌరులు బాగుంటే రాష్ట్రం.. దేశ అభివృద్ధి సాధ్యమని, ఇందులో భాగంగానే అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో వేములవాడలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌, అలాగే భీమారంలో పోలీస్‌ స్టేషన్‌ మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అండగా ఉంటున్నారని చెప్పారు.

ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకం

- ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. అన్ని సెలవుల్లో వారు విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి హోం శాఖ నిర్వహిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు దాడులు చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం ఇటీవల ప్రారంభించామని గుర్తుచేశారు. అరైవ్‌.. అలైవ్‌ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. తాను కోరిన వెంటనే రుద్రంగికి సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేశారని వెల్లడించారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు రూ. 150 కోట్లతో కొనసాగుతున్నాయని, మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు చేయిస్తున్నామని, రుద్రంగికి అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు అయిందని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేములవాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇవ్వాలని, అలాగే భీమారంలో పోలీస్‌ స్టేషన్‌ ఇవ్వాలని, వేములవాడలో ఆలయ భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాలని డీజీపీని కోరారు. రుద్రంగి, భీమారంలో రెవెన్యూ, మండల పరిషత్‌ భవనాలు ఇస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం అదృష్టమని పేర్కొన్నారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత.. మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్‌ స్టేషన్‌ ఎంతో కీలకమని స్పష్టం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎకరం 10 గుంటల స్థలం కేటాయించామని తెలిపారు. జిల్లా పోలీస్‌ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు, మహాశివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జనవరిలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రైమ్‌ రేట్‌ తక్కువగా ఉందని తెలిపారు. మండల ప్రజల సహకారంతో మండల కేంద్రంలో నేరాల నియంత్రణ కోసం ఇటీవల హైక్వాలిటీ నంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవొ రాధాబాయి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దారు పుష్పలత, సీఐలు వెంకటేశ్వర్లు, మోతిరామ్‌, సర్పంచ్‌ గండి నారాయణ, ఉపసర్పంచ్‌ మాడిశేట్టి అభిలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:21 AM