ధాన్యం మిల్లర్ల మాయాజాలం..!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:47 AM
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓ రైస్ మిల్లుకు కేటాయిస్తే ఆ ధాన్యం బ్లాక్ లిస్టులో ఉన్న మరో మిల్లుకు చేరుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎల్లారెడ్డిపేట, మే31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓ రైస్ మిల్లుకు కేటాయిస్తే ఆ ధాన్యం బ్లాక్ లిస్టులో ఉన్న మరో మిల్లుకు చేరుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ధాన్యం స్వీకరించే అర్హత లేని మిల్లులకు ఐకేపీలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కీలక పాత్ర పోషిస్తుండడం ఎల్లారెడ్డిపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మండల కేంద్రంతో పాటు పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, బొప్పాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మండలంలోని ఓ రైస్ మిల్లుకు కేటాయించా రు. లారీల్లో ధాన్యం ఆ మిల్లుకు చేరుకోకముందే ఐకేపీలో విధులు నిర్వ హిస్తున్న ఓ అధికారి తన బినామీ పేరిట గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న మండలంలోని రెండు రైస్ మిల్లులకు తరలించుకుపోయారు. సుమారు 10 లారీల ధాన్యాన్ని దర్జాగా హమాలీలతో దిగుమతి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనతో పాటు ధాన్యం నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులు గతంలో కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలు, నిబంధనల ఉల్లంఘనలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన అధికారులు ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఆ మిల్లులకు ప్రస్తుతం ధాన్యాన్ని కేటాయించడం లేదు. భారీస్థాయిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల నుంచి తప్పించుకునేందుకు చాకచక్యంగా ఓ అధికారి లారీల ధాన్యాన్ని బ్లాక్ లిస్టులోని మిల్లులకు తరలించడంలో ప్రధానపాత్ర పోషించారు. వేలా ది టన్నుల ధాన్యం ఇప్పటికే తమ మిల్లుల్లో నిల్వ చేశారని సమాచారం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలిస్తే బ్లాక్ లిస్టులోని మిల్లు లో నిల్వ ఉన్న ధాన్యం బయటపడే అవకాశాలున్నాయని పలువురు రైస్ మిల్లర్లు పేర్కొన్నారు. అక్రమంగా తరలించిన ధాన్యం మాయాజాలంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై అద నపు కలెక్టర్ గడ్డం నగేశ్‌ను వివరణగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓ మిల్లుకు కేటాయిస్తే.. బ్లాక్ లిస్టులో ఉన్న రైస్‌మిల్లుకు ధాన్యం తరలించిన ట్లు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్య లు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మిల్లర్లు ధాన్యం తరలించి బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లుల్లో దిగుమతి చేస్తే కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ వివరించారు.