డీసీఎంఎస్‌లో ‘లీజు’ దందా..!
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:22 AM
జిల్లా కేంద్రంలోని ది కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
జగిత్యాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ది కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని 23వ వార్డులో గత యేడాది జనవరిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్, రైతు సేవా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం లీజు ప్రక్రియ పూర్తి చేయకుండానే కాంప్లెక్స్‌లోని ఏడు షటర్లను వినియోగానికి ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో షటర్‌కు నెలకు రూ.8 వేల చొప్పున అద్దె నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఏడు షటర్ల నుంచి నెలకు సుమారు రూ.56 వేల వరకు వసూళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫలీజు లేకుండానే అద్దె వసూళ్లు..
కాంప్లెక్స్‌లోని షటర్లను నిబంధనల ప్రకారం లీజుకు ఇచ్చేందుకు బహిరంగ ప్రక్రియ, అనుమతులు, ఒప్పందాలు వంటి విధానాలు పాటించాల్సి ఉంది. అందుకు భిన్నంగా కొందరికి దుకాణాలు అప్పగించి అద్దెలు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో షటర్‌కు మూడు నెలల అద్దెను అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఒక్కో దుకాణం నుంచి సుమారు రూ.24 వేల చొప్పున అడ్వాన్స్ వసూలు చేసినట్లు సమాచారం.
ఫమూడు నెలల అడ్వాన్స్
ఈ వ్యవహారం ఏడాది కాలంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడు షటర్ల నుంచి నెలకు రూ.56 వేల చొప్పున వసూలు జరిగితే రూ. లక్షల్లో వరకు అవుతుందన్న అంచనా ఉంది. అయితే ఈ మొత్తాలు డీసీఎంఎస్ అధికారిక ఖాతాల్లో జమయ్యాయా? లేక మరెక్కడైనా జమ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫవిద్యుత్ బిల్లులపైనా అనుమానాలు
అద్దెతో పాటు షటర్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల వసూళ్లపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల సుమారు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు విద్యుత్ బిల్లుల పేరుతో దుకాణదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే బిల్లులను డీసీఎంఎస్ కార్యాలయం నుంచి చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే బిల్లుకు సంబంధించి రెండు చోట్ల చెల్లింపులు జరుగుతున్నాయా? దుకాణదారుల నుంచి వసూలైన విద్యుత్ బిల్లుల మొత్తాలు ఎక్కడ జమ అవుతున్నాయి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఫఓ అధికారి కనుసన్నల్లోనే...?
డీసీఎంఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దెలు, అడ్వాన్సులు, విద్యుత్ బిల్లుల వసూళ్లకు సంబంధించి అధికారిక రశీదులు జారీ చేశారా? వసూలైన మొత్తాలను సంస్థ ఖాతాల్లో జమ చేశారా? అన్నది పరిశీలించాల్సి ఉంది. ఆరోపణలు నిజమైతే సంస్థ ఆదాయానికి గండి పడటంతో పాటు నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుంది.
ఫతప్పులు కప్పిపుచ్చుకునేందుకే కొత్త అగ్రిమెంట్లు..
ఇటీవల షటర్ల వినియోగదారులతో అద్దె అగ్రిమెంట్లు చేయిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం లీజు ప్రక్రియ లేకుండా కొనసాగిన వ్యవహారానికి ఇప్పుడు అగ్రిమెంట్ల రూపంలో చట్టబద్ధత కల్పించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో వసూలైన అద్దెలు, అడ్వాన్సులు, విద్యుత్ బిల్లుల లెక్కలు ఏమిటి? వాటికి రశీదులు ఉన్నాయా? అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.
ఫఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏది..?
డీసీఎంఎస్ ఆస్తులు సంస్థకు ఆదాయ వనరులు. వాటిని నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. కాంప్లెక్స్‌లోని అన్ని షటర్ల లీజు ప్రక్రియ, అద్దె వసూళ్లు, అడ్వాన్సులు, విద్యుత్ బిల్లులు, బ్యాంకు లావాదేవీలు, రశీదు పుస్తకాలను పరిశీలిస్తే అసలు లెక్కలు బయటపడే అవకాశం ఉంది. సంస్థకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టిందా? లేక అన్ని మొత్తాలు అధికారికంగానే జమ అయ్యాయా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈవిషయమైన కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మేనేజర్ శివ నాగేందర్‌రెడ్డి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిలను సంప్రదించగా నిబంధనల ప్రకారమే లీజు వ్యవహారం జరుగుతోందని ఎలాంటి అక్రమాలకు చోటు లేదని తెలిపారు.