భూముల సర్వే వేగంగా చేపట్టాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:51 PM
జిల్లాలో చేపడుతున్న భూముల సర్వే, రీ సర్వే మరింత వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
18కెఎన్‌ఆర్-10
----------------
5590 - సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ చిత్రా మిశ్రా
---------------------
- సాదాబైనామా, భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
- కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న భూముల సర్వే, రీ సర్వే మరింత వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సాదా బైనామా, భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి అంశంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ప్రజలకు వేగంగా సేవలందించాలని అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో భూముల సర్వే, రీ సర్వే, భూభారతి-సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన భూముల సర్వే నంబర్లపై రీసర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 70 గ్రామాల్లో భూముల సర్వే నంబర్లపై సర్వే చేపడుతున్నామని, అప్పటికే ఏడు గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 94,637 ఎకరాల భూముల సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో కరీంనగర్, హుజూ రాబాద్ ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, గృహనిర్మాణశాఖ అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మోబిన్, కాళీచరణ్, మాధవితోపాటు అధికారులు పాల్గొన్నారు.