కార్తెలు పోయే.. కాలం రాదాయే..
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:05 AM
మృగశిర కార్తె ఆరంభంలోనే కురిసే ఒకటిరెండు వానలతో పత్తి విత్తనాలు విత్తుకొని రైతులు సాగు పనులకు శ్రీకారం చుడతారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మృగశిర కార్తె ఆరంభంలోనే కురిసే ఒకటిరెండు వానలతో పత్తి విత్తనాలు విత్తుకొని రైతులు సాగు పనులకు శ్రీకారం చుడతారు. మృగశిర పోయి ఆరుద్ర కార్తె వచ్చి మూడు రోజులు గడిచినా వర్షాల జాడలేదు. రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని, ఈవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. జిల్లాలో ఎక్కడో ఒక చోట ఒకటిరెండు మిల్లిమీటర్ల వర్షం తప్ప సాగుకు అవసరమయ్యే వర్షాలు పడకపోవడంతో పత్తి విత్తనాలు వేసే పరిస్థితి లేదు. ప్రతియేటా జూన్ నెలాఖరు వరకు ఒకవైపు విత్తనాలు వేయడం పూర్తయ్యేది. 50 శాతం విత్తనాలు మొలకెత్తే పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జూలై 10వరకు వర్షాలు పడి విత్తనాలు వేయడం పూర్తికాని పక్షంలో కాలం ఎత్తిపోయే అవకాశముంది. ఇదే జరిగితే పత్తిసాగు స్థానే ప్రత్యామ్నాయ సాగు చేపట్టవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ జిల్లాలో రెండో ప్రధాన పంట
జిల్లాలో వరి తర్వాత వర్షాకాలం పత్తిని ప్రధాన పంటగా సాగు చేస్తారు. యాసంగిలో మొక్కజొన్న, పత్తి స్థానంలో సాగవుతుంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం పత్తి సాగు చేసి దానిని తీసిన తర్వాత మొక్కజొన్న సాగు చేస్తారు. జూన్ మొదటిరెండు వారాల్లో పత్తి విత్తనాలు పడితేనే ఆ తర్వాత మొక్కజొన్న సాగుకు వీలవుతుంది. ప్రస్తుతం జూలై 15 వరకు కూడా పత్తి విత్తనాలు పడతాయో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో రెండుపంటలు తీసే రైతులు మక్కసాగుపై ఆశలు వదులుకుంటున్నారు. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 48 వేల నుంచి 54 వేల ఎకరాల వరకు ఉంటుంది. పత్తి విత్తనాలు వేయడానికి ఎదైనా ఒక ప్రాంతంలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే భూమి పదనుకు వచ్చి విత్తనాలు మొలకెత్తే అవకాశముంటుంది. ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు వచ్చిన తర్వాత జిల్లాలోని 16 మండలాల్లో వర్షాలు కురిసి సగటు వర్షపాతం 6 సెంటీమీటర్లు కూడా నమోదు కాలేదు. దీంతో పత్తి విత్తనాలు వేయలేక పోయారు. మృగశిర కార్తెలో కొందరు అడపాదడపా కురిసిన చిరుజల్లులకు విత్తనాలు వేశారు. ఆ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తకుండా డబ్బులు వృఽథా అయిపోయాయి. ప్రస్తుత ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల్లో మరో 15 రోజులు గడిచినా వర్షాలు పడకపోతే పత్తిసాగుపై ఆశలు వదలుకోవలసిందే.
ఫ విత్తనాలు కొనేవారే లేరు
జిల్లాలో ఈసీజన్‌లో 52,938 ఎకరాలు పత్తి సాధారణ సాగు విస్తీర్ణం కాగా 48వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత వానా కాలంలో 46,348 ఎకరాల్లో సాగుకావడంతో ఈ అంచనాకు వచ్చింది. ఈ విస్తీర్ణంలో సాగు కోసం 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్లు 1,20,000 అవసరమవుతాయని వ్యవసాయశాఖ భావించింది. ఆ మేరకు విత్తన వ్యాపారులు విత్తనాలను అందుబాటులో ఉంచారు. వర్షాభావపరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు 10 నుంచి 15శాతం విత్తనాలు మాత్రమే అమ్ముడైనట్లు వారు తెలిపారు.
ఫ ప్రత్యామ్నాయ సాగు కూడా అనుమానమే..
వర్షాలు ఆలస్యమైతే జిల్లాలో 5,294 ఎకరాల్లో పతి సాగుకు బదులుగా కందులు, పెసర, బబ్బెర్ల సాగుకు మారాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. 882 ఎకరాల్లో 71 క్వింటాళ్ల కంది, 2,647 ఎకరాల్లో 265 క్వింటాళ్ల బబ్బెర విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ భావించింది. ఆ మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 50 వేల ఎకరాల సాగుకు బదులు ఐదు వేల ఎకరాల ప్రత్యామ్నాయ సాగునే వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. వర్షాలు కురిసి సాగు పూర్తిగా జరిగితేనే తప్ప ప్రత్యామ్నాయ సాగుతో ఫలితమేమి పెద్దగా ఉండదని రైతులు అంటున్నారు.