Share News

అక్రమాల నిగ్గు తేలింది..A

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:24 AM

ఎట్టకేలకు శాతవాహన విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేలింది. కొన్ని నెలలుగా కొనసాగిన విజిలెన్స విచారణ తుది

అక్రమాల నిగ్గు తేలింది..A

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

ఎట్టకేలకు శాతవాహన విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేలింది. కొన్ని నెలలుగా కొనసాగిన విజిలెన్స విచారణ తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ నివేదిక ఆధారంగా అప్పట్లో జరిగిన తప్పిదాలకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సర్కారు లిఖిత పూర్వకంగా లేఖను శాతవాహన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌కు పంపించింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం ఈ ఉత్తర్వులు యూనివర్సిటీకి చేరడంతో నివేదికలో పొందుపర్చిన విధంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసీలో చర్చించి చట్టపరంగా చర్యలకు సిద్ధమవుతున్నారు.

ఫ అసలేం జరిగిందంటే..

శాతవాహన విశ్వవిద్యాలయంలో గతంలో పనిచేసిన వైస్‌ఛాన్సలర్‌పై 16 అంశాలతో కూడిన ఫిర్యాదును 2024 జూన18వ తేదీన విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 2021 నుంచి 2024 వరకు వర్సిటీకి వచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయని ప్రధాన ఆరోపణలు చేశారు. దీంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా నానటీచింగ్‌ స్టాఫ్‌ను నియమించారనే అభియోగాలను ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అర్హతలు లేనివారికి పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. అకారణంగా ఐదుగురు కాంట్రాక్ట్‌ అధ్యాపకులను తప్పుడు ఆరోపణలతో తొలగించారనే విషయాన్ని ప్రస్తావించారు. పరీక్షపత్రాల లీకేజీని పట్టించుకోలేదని, ఎగ్జామినేషన బ్రాంచిల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని పొందుపర్చారు. ఆడిట్‌ నివేదికల ఆధారంగా సమగ్రంగా విచారణ జరిపి వర్సిటీలోని పెద్దలపై తగు చర్యలు తీసుకోవాలని కోరడంతో విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ రంగంలోకి దిగింది. అంతకుముందే ముఖ్యమంత్రికి ఈ విషయమై 2024 మే 18న కూడా ఫిర్యాదు అందింది. ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణను జరిపిన అధికారులు 70 పేజీల తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సమర్పించింది. దీంతో పలు తప్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన సర్కారు తదుపరి చర్యలు బాధ్యులపై తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఫ సమగ్రంగా విచారణ..

కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్రమాలు, అవినీతిపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు కూలంకుశంగా పలు వివరాలను తెలుసుకుని సమగ్రమైన విచారణను చేపట్టారు. సిబ్బంది కొరత, ఇతరత్రా కారణాలతో కొన్ని నెలల తరబడి ఈ ప్రకియ్ర కొనసాగినప్పటికీ అన్ని అంశాలకు సంబంధించి పక్కా సమాచారాన్ని సేకరించారు. విడతలవారీగా వర్సిటీ ఉద్యోగులను వివరాలు అడిగారు. దీంతోపాటు పలుమార్లు రికార్డులను తనిఖీ చేశారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఇక్కడి వాస్తవాలను తెలుసుకునేందుకు విజిలెన్స అధికారులు శ్రమించారు. ఒక దశలో అక్రమాలకు పాల్పడిన వాళ్లు పలురకాల ఒత్తిళ్లు తెచ్చినా.. విచారణలను వాయిదా వేయాలనే విధంగా పైరవీలు చేసినా వేటిని లెక్కించకుండా అసలు నిగ్గును అధికారులు తేల్చారు. నివేదికలో అసలు యూనివర్సిటీలో ఏమేమి తప్పులు జరిగాయి.? వాటిని ఎవరు చేశారు.? ఏఏ విషయాల్లో నిబంధనలు అతిక్రమించారనే మొత్తం వాస్తవాలను తుది నివేదికలో సర్కారుకు తేల్చి చెప్పారు. తుది నివేదిక సహా ఏ తరహా చర్యలు తీసుకోవాలనే అంశాలను మాత్రం అధికారులు బహిర్గతం చేయడం లేదు.

ఫ హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు

యూనివర్సిటీలో కొన్నేళ్లుగా జరిగిన తప్పిదాలపై సర్కారు సీరియస్‌గా ఉండడంతో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా యూనివర్సిటీలో బోధన మెరుగవుతూ అక్రమాలు, అవినీతికి తావులేకుండా పూర్తిగా వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. గతంలో తప్పులు చేసిన వారిని కఠినంగా చట్టప్రకారం శిక్షిస్తే ఇకముందు కూడా ఇక్కడి అధికారులు, ఉద్యోగుల్లో భయం ఉంటుందనే భావనను విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి విద్యావ్యవస్థ మరింత మెరుగ్గా గాడిలో పడాలంటే అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజిలెన్స విచారణకు సంబంధించి శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ఉమేశకుమార్‌ను వివరణ అడుగగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజిలెన్స విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీకి లేఖ వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఈసీలో చర్చించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 11 , 2026 | 01:24 AM