రైతు ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:14 AM
ఇందిరమ్మ రాజ్యంలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ రాజ్యంలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని 1.06కోట్ల మందికి ‘ఇందిరాగాంధీ జీవిత బీమా పథకం’ వర్తించేలా సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభలో ప్రకటించనున్నారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ మార్కెటు కమిటీ కార్యా లయంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కమిటీ సభ్యులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రారాజులను చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని భయభ్రాంతులకు గురిచేసి వారి ఫామ్ హౌజ్‌ల్లో వరి పంటలను సాగు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందించిందన్నారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణలోనే ఉన్నట్లు హారీష్‌రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారని, వంద దేశాల్లో ఉన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు రైతులకు ప్రభుత్వానికి వారధిలా పని చేసి మన్ననలు పొందాలని అన్నారు. ఈ నెల 19న సిద్ధిపేటలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు.
రూ.6వేల కోట్లు వడ్డీ
డెభ్బై ఏళ్లలో 13 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలు, జలాశయాల నిర్మాణాలకు రూ.75వేల కోట్లు అప్పులు చేసి వెచ్చిస్తే.. యేడాదికి రూ.6 వేల కోట్ల వడ్డి కట్టాల్సి ఉండే దని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలతో రూ.8.12 లక్షల కోట్లు అప్పు పెడితే తెలంగాణ రాష్ట్రం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కట్టే దుస్థితికి తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలనలో విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించడం తో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు చెప్పా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలిశ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దేవానందం, జిల్లా గ్రంధాలయ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.