తీరనున్న తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:47 AM
సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు దశాబ్దాల తరబడి ఉన్న తాగునీటి కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి.
సుల్తానాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు దశాబ్దాల తరబడి ఉన్న తాగునీటి కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి. అమృత్2.0 పథకం ద్వారా పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం రూ.18.50 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పనుల ప్రారంభానికి సంబంధించి ఏడాది క్రితం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్న మామిడి తోట నర్సరీ ప్రాంగణంలో అమృత్ పథకంతో మంజూరైన నిధులను వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టారు.
ఫ దశాబ్ధాల తరబడి తాగునీటి సమస్య..
సుల్తానాబాద్ పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను కొన్ని దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీగా ఉన్నపుడు దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందట పట్టణంలో రక్షితమంచినీటి పథకం ప్రారంభించి నల్లాల ద్వారా తాగునీటిని అందించారు. కొన్ని ప్రాంతాలు రోజు తర్వాత రోజు, మరి కొన్ని ప్రాంతాలు రెండు రోజులకోమారు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశారు. కానీ సంపూర్ణంగా ఆ ఫథకం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చలేకపోయింది. ఇప్పటికిని పట్టణలో రోజు తర్వాత రోజు నీటి సరఫరా జరుగుతున్నది.
ఫ మిషన్ భగీరథ నల్లాలు నిరుపయోగం..
పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ బిగించిన నల్లాల ద్వారా నీరు రావడం లేదు. మిషన్ భగీరథ పైపుల ద్వారా కేవలం ట్యాంకులకు మాత్రమే నీరందిస్తున్నారు. ట్యాంకుల ద్వారా పాత పైపులైన్ల ద్వారా మాత్రమే నీటిసరఫరా జరుగుతున్నది. ప్రస్తుతం గట్టేపల్లి మానేరు నుంచి పైపులైన్ల ద్వారా సుల్తానాబాద్ ఆశోక్‌నగర్‌లోని సంప్‌లో సప్లై జరుగుతున్నది. ఇక్కడ నుంచి ట్యాంకులకు మళ్లీ నీటిని ఎక్కించడం లేదా నేరుగా సమీప ప్రాంతాలకు నల్లాల ద్వారా సరఫరా జరుగుతున్నది. ప్రతీ రోజు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఒక మిలియన్ లీటర్ల అవసరం ఉంటుంది. కానీ తరుచూ మోటార్లు కాలిపోయినపుడు సమస్య తలెత్తుతోంది. వర్షాలు వరదల వల్ల మానేరులో ఉన్న బావిలోని మోటార్లు మునిగిపోతున్నాయి. మరికొన్ని సమస్యల వల్ల కాలిపోతున్నాయి. ఈ దుస్థితిలో నీటి సరఫరా రోజుల తరబడి నిలిచిపోతోంది.
ఫ సుల్తానాబాద్ పట్టణంలో తాగునీటి సమస్యకు చెక్
- ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్ పట్టణంలో శాశ్వతంగా తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అమృత్2.0 ద్వారా రూ.18 కోట్లతో పనులు చేపట్టాం. పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే పట్టణంలో ప్రతీ రోజు నల్లాల ద్వారా తాగునీరు అందించవచ్చు. అలాగే పట్టణంలోని అన్ని వార్డులకు నాణ్యమైన పైపులైన్లు వేయిస్తున్నాము. గతంలో లాగా పైపులైన్ల ధ్వంసం వంటివి ఎదురుకావు. 22కిలోమీటర్ల పరిధిలో పైపులు వేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ఫ ఇబ్బందులు లేకుండా సరఫరా..
- రమేష్, మున్సిపల్ కమిషనర్, సుల్తానాబాద్
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తానాబాద్‌తోపాటు పూసాల సుగ్లాంపల్లి విలీన గ్రామాలున్నాయి. ప్రజలకు నీటిసరఫరా చేయడం కోసం అందుబాటులో దాదాపు 13ట్యాంకులు ఉన్నాయి. ఇందులో కొన్ని పనిచేయడం లేదు. ప్రస్తుతం అమృత్‌పథకం ద్వారా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో తాగునీటి సమస్య ఉండదు. అలాగే వినియోగం లేని కొన్ని ట్యాంకుల ద్వారా కూడా తాగు నీటి సరఫరా జరుగబోతుంది. మున్సిపాలిటీలో దాదాపు ఆరు వేల గృహాలు, 3500నల్లాలు ఉన్నాయి. అమృత్‌పథకం ద్వారా పట్టణంలో పైపులైన్ల ఏర్పాటు కూడా జరుగుతున్నది. ఇక భవిష్యతులో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.