హాస్టల్ పొమ్మంటోంది !
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:16 AM
పాఠశాల పిల్లలకు వేసవి సెలవులు అంటే చెప్పలేని ఆనందం, సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలనే ప్రణాళికలు వేసుకుంటారు. అందుకు అనుగుణంగా వినోద, విహారయాత్రలు, ఊర్లకు వెళ్తుంటారు. అయితే తల్లిదండ్రులు లేని, తల్లి లేదా తండ్రి లేని వారు, ఉన్నా వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే కుటుంబాల పిల్లలకు మాత్రం వేసవి సెలవులు వస్తే ఆందోళన నెలకొంటోంది.
- అనాథ విద్యార్థుల్లో ఆందోళన
- వేసవి సెలవులొస్తే హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి
- ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి
- క్యాంపులు ఏర్పాటు పైనేఆశలు
జగిత్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల పిల్లలకు వేసవి సెలవులు అంటే చెప్పలేని ఆనందం, సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలనే ప్రణాళికలు వేసుకుంటారు. అందుకు అనుగుణంగా వినోద, విహారయాత్రలు, ఊర్లకు వెళ్తుంటారు. అయితే తల్లిదండ్రులు లేని, తల్లి లేదా తండ్రి లేని వారు, ఉన్నా వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే కుటుంబాల పిల్లలకు మాత్రం వేసవి సెలవులు వస్తే ఆందోళన నెలకొంటోంది. తోటి విద్యార్థులు వెళ్తుంటే..తాము ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి వారిది. దీంతో సెలవులు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ ఆవేదనలో ఉన్నారు.
సుమారు 2 వేలకు పైగా పిల్లలు
జిల్లాలో తల్లిదండ్రులు లేని వారు, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులు సుమారు 2 వేలకు పైగా ఉంటారని అంచనా ఉంది. వీరందరూ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులాలు, కసూర్బా పాఠశాలలు, జ్యోతిరావుపూలే గురుకులాలు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్నారు. అన్ని సొసైటీల్లో కలిపి సుమారు 16 వేల మంది పిల్లలున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ప్రభుత్వ వసతి గృహాల్లో సైతం పలువురు విద్యార్థులు వసతి పొందుతున్నారు. జిల్లాలో 5 ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 3,600 మంది విద్యార్థులు ఉండగా ఒక్కో పాఠశాలలో సుమారు 10 మంది వరకు అనాథ పిల్లలు, మరో 50 మంది వరకు తల్లి గానీ, తండ్రి గానీ లేని పిల్లలున్నట్లు అంచనా ఉంది. జిల్లాలోని తొమ్మిది బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లలో, 5 మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సుమారు 6,500 మంది విద్యార్థులుండగా, ఇందులో సుమారు 500 మంది వరకు అనాథ పిల్లలున్నట్లు అంచనా ఉంది. వేల్ఫేర్ పాఠశాలలు, ఆశ్రమాలు, గురుకులాల్లో ఉన్న అనాథ పిల్లల వివరాలను సేకరించాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో 98 మంది అనాథ విద్యార్థులు
ఇటీవల ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్స్ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల వివరాలను అధికారులు సేకరించారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో 46 బాలురు, 33 మంది బాలికలు, కేజీబీవీల్లో 19 మంది బాలికలు అనాథలుగా గుర్తించారు. సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. అయితే అనాథ పిల్లల అవసరాల కొరకు సమ్మర్ క్యాంపు నిర్వహణపై ఆలోచన జరగడం లేదు.
అంతంతమాత్రంగానే క్యాంపులు
కేజీబీవీ పాఠశాలల పిల్లల కోసం ప్రతి వేసవిలో ప్రభుత్వం క్యాంపులు పెడుతోంది. అదేవిదంగా అనాథ పిల్లలు, తల్లి గానీ, తండ్రి గానీ లేని పిల్లల కొరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు పెట్టాలన్న డిమాండ్ ఉంది. అదే విధంగా క్యాంపుల్లో ఉన్న విద్యార్థులను వేసవిలో టూర్లకు తీసుకవెళ్లడం, కొత్త ప్రదేశాలను చూపించి వారిలో ఆనందాన్ని నింపాల్సి ఉంది. ఆ దిశగా ఆలోచనలు జరగడం లేదు. అందుకోసమే గ్రాండ్ పేరేంట్స్, దూరపు బందువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి తల దాచుకోవాల్సి వస్తోందని పిల్లలు అంటున్నారు. ప్రతి యేటా జరుగుతున్న సమ్మర్ క్యాంపుల్లో సరైన వసతులు ఉండకపోవడం, మెనూ సక్రమంగా పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు. క్యాంపుల్లో ఉన్న విద్యార్థులకు సంగీతం, చిత్రలేఖనం, పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంతోషాన్ని నింపాల్సి ఉంటుంది. ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.
ఫ జిల్లాలో ఖరారు కాని సమ్మర్ క్యాంపులు
మరి కొన్ని రోజుల్లో వేసవి సెలువులు మొదలు అవుతాయి. కానీ ఇప్పటివరకు క్యాంపుల విషయం తేలలేదు. గత యేడాది జిల్లాలోని 16 కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు జగిత్యాలలో క్యాంపు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ క్యాంపు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రాథమికంగా సారంగపూర్ కేజీబీవీలో నిర్వహించాలని ఆలోచన చేసినప్పటికీ ఇంకా ప్రణాళిక ఖరారు కాలేదు. కేజీబీవీ సమ్మర్ క్యాంపుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ అవకాశం కల్పిస్తుంటారు. అనాథ పిల్లలు, సెమీ అనాథ పిల్లల కొరకు ప్రత్యేక క్యాంపులు ఏమీ నిర్వహించడం లేదు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్వహిస్తాం
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి, జగిత్యాల
జిల్లాలో అనాథ పిల్లల కొరకు సమ్మర్ క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం అనాథ పిల్లల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. కాగా ప్రతి సంవత్సరం మాదిరిగానే కేజీబీవీల్లో చదివే బాలికల కొరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే క్యాంపుల నిర్వహణ, వసతుల ఏర్పాట్లు చేస్తాం. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంపులు నిర్వహించేందుకు పకడ్భందీగా చర్యలు తీసుకుంటాం.